న్యూఢిల్లీ, డిసెంబర్ 1: వాహన అమ్మకాలు టాప్‌గేర్‌లో దూసుకుపోయాయి. పండుగ సీజన్ ముగిసినప్పటికీ వాహనాలకు డిమాండ్ మాత్రం తగ్గలేదు. దీంతో గత నెలలో కార్ల తయారీలో అగ్రగామి సంస్థలైన మారుతి సుజుకీ, టాటా మోటర్స్, మహీంద్రాలు రెండంకెల వృద్ధిని నమోదు చేసుకున్నాయి. మారుతి సుజుకీ అయితే నవంబర్ నెలలో రికార్డు స్థాయి విక్రయాలు జరిపింది. కంపెనీ 40 ఏండ్ల చరిత్రలో ఒక నెలలో ఇంతటి స్థాయిలో అమ్మకాలు జరపడం ఇదే తొలిసారి కావడం విశేషం. గత నెలలో ఎగుమతులు కలుపుకొని 2.29 లక్షల యూనిట్ల వాహనాలను అమ్మేసింది. వీటిలో దేశీయంగా 1.70 లక్షలు విక్రయించింది.
వీటిలో చిన్న కార్లు, ఎస్‌యూవీలు అత్యధికంగా అమ్ముడయ్యాయని మారుతి సీనియర్ ఎగ్జిక్యూటివ్ పార్థో బెనర్జీ తెలిపారు. మరోవైపు, టాటా మోటర్స్ ప్యాసింజర్ 57,436 యూనిట్ల వాహనాలను విక్రయించగా, మహీంద్రా అండ్ మహీంద్రా 56,336 యూనిట్లు, హ్యుందాయ్ మోటర్ 50 వేల యూనిట్లు, టయోటా కిర్లోస్కర్ 33,752, కియా ఇండియా 24 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది. ద్విచక్ర వాహన విషయానికి వస్తే హోండా మోటర్‌సైకిల్ అండ్ స్కూటర్ 5,91,136 బైకులను విక్రయించింది.
