దేశంలో పారిశ్రామికోత్పత్తి పడకేసింది.
వృద్ధికి దూరమైన పరిశ్రమ.. ఎక్కడిదక్కడే అన్నట్టు తయారైంది.
అక్టోబర్‌లో ఏకంగా ఏడాదికిపైగా కనిష్ఠానికి ఉత్పాదకత దిగజారింది. ఐఐపీ గ్రోత్ రేటు 0.4 శాతానికే పరిమితమైంది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 1: దేశీయ పారిశ్రామికోత్పత్తి నీరసించిపోయింది. కీలక రంగాల్లో ఉత్పాదకత ఎక్కడిదక్కడే అన్నట్టు తయారైంది. అక్టోబర్‌కుగాను సోమవారం విడుదలైన కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాల్లో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) ఏడాదికిపైగా కనిష్ఠాన్ని తాకుతూ 0.4 శాతం వృద్ధికే పరిమితమైంది. విద్యుత్తు, గనులు, తయారీ రంగాల పేలవ ప్రదర్శనతో గత ఏడాది సెప్టెంబర్ నాటి స్థాయికి క్షీణించింది. గతంతో పోల్చితే నాడు వృద్ధి శూన్యంగా నమోదైంది. మళ్లీ ఆ స్థాయిలో ఐఐపీ గణాంకాలు ఇవే కావడం గమనార్హం. ఇక నిరుడు అక్టోబర్‌లో ఐఐపీ వృద్ధి 3.7 శాతంగా ఉన్నట్టు జాతీ య గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) తమ తాజా వివరాల్లో పేర్కొన్నది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో 4.6 శాతమని వెల్లడించింది.
తయారీ రంగ వృద్ధిరేటు ఈ అక్టోబర్‌లో 1.8 శాతానికి పడిపోయింది. నిరుడు అక్టోబర్‌లో 4.4 శాతంగా ఉన్నది. గనుల రంగంలోనైతే వృద్ధిరేటు మైనస్ 1.8 శాతంగా నమోదైంది. పోయినసారి వృద్ధి 0.9 శాతంగానైనా ఉన్నది. ఇక విద్యుదుత్పత్తి గ్రోత్ ఏకంగా మైనస్ 6.9 శాతంగా ఉండటం గమనార్హం. గత ఏడాది ఇదే నెలలో 2 శాతం వృద్ధిని కనబర్చింది. దీంతో మొత్తంగా అక్టోబర్ నెలలో ఐఐపీ వృద్ధిరేటు నిరాశపర్చింది. అలాగే క్యాపిటల్ గూడ్స్లోలో వృద్ధిరేటు 2.9 శాతం నుంచి 2.4 శాతానికి పడిపోవడం కూడా దెబ్బతీసింది. అంతేగాక కన్జ్యూమర్ డ్యూరబుల్స్‌లో వృద్ధి మైనస్ 0.5 శాతానికి పతనమైంది.
నిరుడు అక్టోబర్‌లో 5.5 శాతం వృద్ధి నమోదవడం విశేషం. కన్జ్యూమర్ నాన్-డ్యూరబుల్స్ ఉత్పత్తి కూడా మైనస్ 4.4 శాతంలోకి పడిపోయింది. మునుపు 2.8 శాతం వృద్ధి ఉన్నది. ప్రైమరీ గూడ్స్‌లోనూ ఉత్పాదకత గతంతో చూస్తే 2.5 శాతం వృద్ధి నుంచి మైనస్ 0.6 శాతానికి దిరింది. ఈ క్రమంలోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్/కన్స్ట్రక్షన్ గూడ్స్‌లో వృద్ధిరేటు ఈసారి 7.1 శాతానికి పెరిగినా ఫలితం లేకపోయింది. నిరుడు అక్టోబర్‌లో ఇది 4.7 శాతంగానే ఉన్నది. ఇంటర్మీడియెట్ గూడ్స్ సెగ్మెంట్లో వృద్ధిరేటు 0.9 శాతంగా నమోదైంది. పోయిన ఏడాది అక్టోబర్‌లో 4.8 శాతంగా ఉన్నట్టు ఎన్ఎస్వో చెప్పింది.
ఈ ఆర్థిక సంవత్సరం (2025-26) తొలి 7 నెలల్లో (ఏప్రిల్-అక్టోబర్) దేశీయ పారిశ్రామికోత్పత్తి వృద్ధిరేటు 2.7 శాతానికి దిగజారినట్టు ఎన్ఎస్వో తెలియజేసింది. గత ఆర్థిక సంవత్సరం (2024-25) ఇదే వ్యవధిలో 4 శాతంగా ఉండటం గమనార్హం. ఇక తయారీ రంగంలో 23 ఇండస్ట్రీ గ్రూపులుంటే.. అందులో 9 మాత్రమే గతేడాది అక్టోబర్‌తో పోల్చితే ఈ ఏడాది అక్టోబర్‌లో వృద్ధిని ప్రదర్శించాయి. మిగతా 14 రంగాలు ఉత్పత్తిపరంగా వృద్ధికి దూరంగానే ఉన్నట్టు తేలింది.
దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రగతి ఆందోళనకరంగా తయారైంది. కీలకమైన పారిశ్రామిక రంగంలో ఉత్పాదకత క్షీణత.. దేశంలో తగ్గిన వినియోగదారుల కొనుగోలు సామర్థ్యం, మార్కెట్లో పడిపోయిన డిమాండ్‌ను ప్రతిబింబిస్తున్నదని మెజారిటీ ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారిప్పుడు. ఇక ఈ ఉత్పత్తి పతనం నిరుద్యోగానికి దారితీస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. నిజానికి పరిశ్రమకు పెట్టుబడులు, రుణ లభ్యత, ప్రభుత్వ ప్రోత్సాహకాలు కరువైపోయాయని గుర్తుచేస్తున్నారు. ఐఐపీ తాజా గణాంకాలే అందుకు నిదర్శనంగా వారంతా పేర్కొంటుండటం ప్రస్తుత విపత్కర పరిస్థితులకు అద్దం పడుతున్నది.
ఇప్పటికే రాబోయే ఆర్థిక సంవత్సరానికి (2026-27)గాను కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పార్లమెంట్లో ప్రవేశపెట్టే బడ్జెట్లో పరిశ్రమలకు పన్ను రాయితీలు, ఇతర ప్రోత్సాహకాలు అందివ్వాలని పరిశ్రమ పెద్దలు, ఆయా రంగాల ప్రతినిధులు కోరుతున్న విషయం తెలిసిందే. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఈ మేరకు పారిశ్రామిక, వ్యాపార సంఘాలు సైతం లేఖల ద్వారా సూచనల్నీ ఇస్తున్నాయి. మొత్తానికి దేశీయ పరిశ్రమలో నీరసాన్ని తాజా ఐఐపీ గణాంకాలు స్పష్టంగా చూపాయనే చెప్పవచ్చు.