ముంబై, డిసెంబర్ 1: దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయి నుంచి వెనక్కిమళ్లాయి. మదుపరుల ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గుచూపడంతోపాటు విదేశీ పెట్టుబడులు తరలిపోవడంతో ప్రారంభంలో భారీగా లాభపడిన సూచీలు చివర్లో నష్టాల్లోకి జారుకున్నాయి. ఇంట్రాడేలో 450 పాయింట్లకు పైగా లాభపడి చారిత్రక గరిష్ఠ స్థాయి 86,159 పాయింట్లను తచ్చాడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరికి 64.77 పాయింట్లు కోల్పోయి 85,641.90 వద్ద ముగిసింది.
మరో సూచీ నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 122.85 పాయింట్లు ఎగబాకి లైఫ్‌టైం హైకీ 26,335.80 స్థాయికి చేరుకున్న సూచీ చివర్లో 27.20 పాయింట్లు నష్టపోయి 26,175.75 వద్ద ముగిసింది. దేశ వృద్ధిరేటు అంచనాలకు మించి దూసుకుపోయినప్పటికీ జీఎస్టీ వసూళ్లు తగ్గుముఖం పట్టడంతో మదుపరుల్లో ఆందోళన నెలకొన్నది. ఫలితంగా అమ్మకాలకు మొగ్గుచూపడం సూచీలు తిరిగి నష్టాల్లోకి జారుకున్నాయని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి.