శుక్రవారం 30 అక్టోబర్ 2020
Business - Aug 25, 2020 , 01:34:12

అలీబాబాకు తైవాన్‌ షాక్‌

అలీబాబాకు తైవాన్‌ షాక్‌

  •  దేశం విడిచి పోవాలని ఆదేశం
  •  చైనాకు తైవాన్‌ పౌర సమాచారం పంపుతున్నదన్న అనుమానాలు 

తైపీ, ఆగస్టు 24: చైనా ఈ-కామర్స్‌ దిగ్గజం అలీబాబాకు తైవాన్‌ సర్కారు షాకిచ్చింది. స్థానిక ఈ-కామర్స్‌ సంస్థల్లో ఉన్న వాటాలను అమ్ముకొని పోవాలని సోమవారం ఆదేశించింది. తైవాన్‌ పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని చైనాకు అలీబాబా తరలిస్తున్నదన్న అనుమానాలే ఇందుకు కారణం. ప్రస్తుతం ఓ బ్రిటిష్‌ కంపెనీ ఆధ్వర్యంలో తౌబౌ తైవాన్‌ ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌ నడుస్తున్నది. అయితే సదరు బ్రిటిష్‌ క్లడ్డాగ్‌ వెంచర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ లిమిటెడ్‌లో అలీబాబాకు 29 శాతం వాటా ఉన్నది. దీంతో అలీబాబా కనుసన్నల్లోనే తౌబౌ ఉంటున్నదని, ఇదంతా తైవాన్‌ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నదని అక్కడి ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ చెప్పింది. తౌబౌ తైవాన్‌తో జరిగిన ఒప్పందం ప్రకారం తమ ఆన్‌లైన్‌ కస్టమర్ల లావాదేవీ వివరాలు చైనాలోని అలీబాబా గ్రూప్‌ సర్వర్‌కు చేరుతున్నాయని, ఈ క్రమంలోనే పౌర సమాచారం చైనా ప్రభుత్వానికీ వెళ్తున్నదని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆరోపిస్తున్నది. దీంతో ఇది తమ పౌరుల వ్యక్తిగత భద్రతకు ముప్పు వాటిల్లేలా ఉందని తైవాన్‌ ప్రభుత్వం నమ్ముతున్నది. ఈ నేపథ్యంలోనే ఆరు నెలల్లో అలీబాబా పెట్టుబడులను ఉపసంహరించుకునేలా చేయాలని బ్రిటిష్‌ సంస్థకు తైవాన్‌ తేల్చిచెప్పింది.