Stock Market Closing | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లోనే ముగిశాయి. అమెరికాలో ఆర్థిక మాంద్యం భయాల మధ్య భారీగా అమ్మకాలతో మార్కెట్లు కుదేలయ్యాయి. అయితే, ఆసియా మార్కెట్లలోని సానుకూల పవనాలతో ఉదయం మార్కెట్ల లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత కొద్దిసేపటికి మార్కెట్లు మళ్లీ అస్థిరతకు గురయ్యాయి. హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐతో పాటు భారతీ ఎయిర్టెల్ షేర్ల విక్రయాలు భారీగా జరిగాయి. ఆ షేర్ల ప్రభావం మార్కెట్‌పై భారీగా ప్రభావం పడింది. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 78,981.97 లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 79,852.08 పాయింట్ల గరిష్ఠానికి చేరగా.. చివరి సెషన్లో 78,496.57 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది.
చివరకు 166.33 పాయింట్ల నష్టంతో 78,593.07 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 63.05 పాయింట్లు పతనమై.. 23,992.55 వద్ద ముగిసింది. నిఫ్టీలో అత్యధికంగా హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ లైఫ్, బీపీసీఎల్, శ్రీరాం ఫైనాన్స్, ఎంఅండ్ఎం, ఎస్బీఐ, భారతీ ఎయిర్టెల్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ షేర్లు నష్టపోయాయి. ఇక బ్రిటానియా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టెక్ మహీంద్రా, లార్సెన్, ఎల్టీఐ మైండ్‌ట్రీ, హెచ్‌సీఎల్ టెక్, హెచ్‌యూఎల్, అదానీ పోర్ట్స్ లాభపడ్డాయి. సెక్టార్లలో ఆటో, బ్యాంక్, ఆయిల్, గ్యాస్ షేర్లు 0.5శాతం పతనమయ్యాయి. ఐటీ, మెటల్, రియాల్టీ 0.3శాతం నుంచి 0.8శాతం వరకు పెరిగాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.5శాతం చొప్పున పతనమయ్యాయి.