IndiGo | న్యూఢిల్లీ, ఆగస్టు 5: దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగో..సరికొత్తగా బిజినెస్ క్లాస్ సీట్లను ప్రవేశపెట్టబోతున్నది. నవంబర్ 14 నుంచి అందుబాటులోకి రానున్న ఈ సీట్లను తొలి దశలో 12 రూట్లలో ప్రవేశపెట్టబోతున్నట్లు ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ తెలిపారు.
విమాన సేవలు ఆరంభించి 18 ఏండ్లు పూర్తైన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..బిజినెస్ క్లాస్ సీట్లతోపాటు అంతర్జాతీయ రూట్లలో విమానాల సంఖ్యను పెంచబోతున్నట్లు ప్రకటించారు.
ఈ బిజినెస్ క్లాస్ టికెట్ ప్రారంభ ధరను రూ.18,018గా నిర్ణయించింది సంస్థ. ఏ321 నియో విమానాల్లో మూడు వరుసల్లో నాలుగు సీట్ల చొప్పున 12 సీట్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నది. ఈ విమానాల్లో మొత్తం సీట్లు 220 కాగా, దీంట్లో 12 బిజినెస్ సీట్లు, 208 ఎకానమి క్లాస్ సీట్లు. ఈ బిజినెస్ సీట్లు మంగళవారం నుంచి బుకింగ్ చేసుకోవచ్చునని సూచించారు. తొలి దశలో ఢిల్లీ-ముంబై రూట్లలో అందుబాటులోకి రానున్నది.