Elon Musk | ప్రపంచ మార్కెట్లో వెండి ధరలు (Silver Price) రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే సామాన్యుడికి అందనంత దూరానికి చేరుకున్న వెండి.. రోజుకొక గరిష్ఠ స్థాయికి చేరుకుంటున్నది. గతంలో ఎన్నడూ లేనివిధంగా కిలో వెండి ధర ఏకంగా రూ.2.50 లక్షలు దాటింది. ఇండస్ట్రీలకు చాలా కీలకమైన వైట్మెటల్ (White metal) రికార్డు స్థాయిలో పెరగడంపై టెస్లా బాస్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
పారిశ్రామిక అవసరాలకు వెండి చాలా కీలకమైందని, అయితే ఈ స్థాయిలో ధరలు పెరగడం మంచిది కాదని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘ఇది మంచిది కాదు. అనేక పారిశ్రామిక ప్రక్రియలకు వెండి అవసరం’ అని ఆయన తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధర ఔన్సుకు 79 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
కాగా, వెండిని ఆభరణాలుగానే కాదు, అనేక పరిశ్రమల్లో పారిశ్రామిక ప్రక్రియల్లో ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, సోలార్ పవర్ ప్యానెల్స్, డేటా సెంటర్లు, విద్యుత్ సంబంధిత పరికరాలు వంటి వాటిలో ఉపయోగిస్తారు. మస్క్‌కు ఎలక్ట్రానిక్ వాహన తయారీ సంస్థ (Tesla) ఉన్న విషయం తెలిసిందే. వెండి ధరల పెరగడంపై మస్క్ ఆందోళన వెనుక ఇదే ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
డిసెంబర్ నెలలో వెండి ధరలు అసాధారణంగా పెరిగాయి. ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా 2026లో ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలుండటంతో మదుపరులు తమ పెట్టుబడులను సురక్షితమైన అతి విలువైన లోహాలవైపు మళ్లించడంతో వీటి ధరలు దూసుకుపోతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. వెండితోపాటూ బంగారం ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి.
Also Read..
బాల జీవన్ బీమా.. పోస్టాఫీస్ స్కీం ప్రయోజనాలెన్నో..
Digitalization | డిజిటలైజేషన్లో యూటర్న్!.. ఆన్లైన్లో కొత్త ఖాతాల విషయంలో బ్యాంకర్లు అప్రమత్తం
వెండి @ 2.52 లక్షలు.. రికార్డు స్థాయిలో దూసుకుపోయిన కిలో ధర