హైదరాబాద్, డిసెంబర్ 27: వెండి వెలుగులు చిమ్ముతున్నది. ఇప్పటికే సామాన్యుడికి అందనంత దూరానికి చేరుకున్న వెండి మరో శిఖరాన్ని అధిగమించింది. రోజుకొక గరిష్ఠ స్థాయికి చేరుకుంటున్న అతి విలువైన లోహాల ధరలు శనివారం రికార్డు స్థాయిలో దూసుకుపోయాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి, వెండి పరుగులు పెట్టింది. కిలో వెండి దాదాపు రూ.20 వేల వరకు అధికమై రూ.2.52 లక్షలు దాటింది. వెండి చరిత్రలో ఈ మైలురాయికి చేరుకోవడం ఇదే తొలిసారి. ఈవారంలోనే ఏకంగా రూ.35 వేల వరకు పెరిగినట్టు అయింది. అటు బంగారం కూడా మరో ఉన్నత శిఖరాలకు చేరుకున్నది. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర రూ.1,44,500 పలికింది.
రిటైల్ మార్కెట్లో దూసుకుపోయిన అతివిలువైన లోహాల ధరలు ఇటు ఫ్యూచర్ మార్కెట్లోనూ రికార్డు స్థాయిలో పలికింది. ఈ వారంలో వెండి ధర 15 శాతం ఎగబాకి రూ.2.42 లక్షలకు చేరుకున్నది. పారిశ్రామిక వర్గాల నుంచి డిమాండ్ అధికంగా ఉండటం వల్లనే ధరలు పుంజుకుంటున్నాయని తెలిపింది. ఎంసీఎక్స్ మార్కెట్లో వెండి వరుసగా ఐదు రోజులుగా పెరుగుతూనే ఉన్నది.
వచ్చే ఏడాది మార్చి నెల డెలివరీకిగాను కిలో వెండి రూ.18,210 లేదా 8 శాతం అందుకొని రూ.2.42 లక్షలకు చేరుకోనున్నది. శుక్రవారం గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 50 డాలర్లు లేదా 1 శాతం ఎగబాకి 4,553 డాలర్లు పలికింది. అలాగే ఔన్స్ వెండి 5.51 డాలర్లు లేదా 8 శాతం అందుకొని 79.70 డాలర్లకు చేరుకున్నది. వచ్చే ఏడాది ఔన్స్ వెండి ధర 100 డాలర్లకు చేరుకునే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ వర్గాలు అంచనావేస్తున్నాయి.