న్యూఢిల్లీ, డిసెంబర్ 27: కొత్త ఖాతాల విషయంలో బ్యాంకర్లు డిజిటలైజేషన్ కంటే సంప్రదాయ పద్ధతులకే మొగ్గు చూపుతున్నారు. ఆన్లైన్ ద్వారా బ్యాంక్ ఖాతాలను తెరువాలని కోరుకునే కస్టమర్ల కోసం బడా బ్యాంకు లు ఇప్పుడు భౌతిక పరిశీలనలకే ఆసక్తి కనబరుస్తున్నాయి మరి. మ్యూల్ అకౌంట్లు, మోసాల నేపథ్యంలో కస్టమర్ల ఇంటికే రిలేషన్షిప్ మేనేజర్లు వెళ్లి పనిని పూర్తిచేస్తున్నారు. లేకపోతే కస్టమర్లను సమీప బ్యాంక్ శాఖలకు రావాలని బ్యాంక్ వర్గాలు కోరుతున్నాయి.
ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియాలు తమ ఎండ్-టు-ఎండ్ డిజిటల్ ఆన్‌బోర్డింగ్ వ్యవస్థల్ని పక్కనపెట్టినట్టు తెలుస్తున్నది. ఐసీఐసీఐ బ్యాంక్ తమ ఇన్‌స్టా-అకౌంట్ ఓపెనింగ్ సర్వీస్‌ను ఆపేసిందని సమాచారం. కేవలం సాలరీ ఖాతాలకే డిజిటల్ ప్రక్రియను వినియోగిస్తున్నట్టు చెప్తున్నారు. మిగతా ఖాతాలను ఆశించే కస్టమర్లు డాక్యుమెంట్స్ సమర్పణకు సమీప బ్యాంక్ శాఖకు వెళ్లాలని బ్యాంక్ అధికారులు సూచిస్తున్నారు. దరఖాస్తుల పరిశీలనకు కస్టమర్ల ఇండ్లకే బ్యాంక్ అధికారులూ వెళ్తున్నారని బ్యాంక్ వర్గాలు చెప్తున్నాయి. పైగా పెరుగుతున్న మోసాలకు నో యువర్ కస్టమర్ (కేవైసీ) నిబంధనలను పాటించకపోవడమేనంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులపై జరిమానాలనూ వేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ ఫైన్ల నుంచీ తప్పించుకున్నట్టు అవుతుందని చాలా బ్యాంకులు భౌతిక పరిశీలనలకే జై కొడుతున్నాయి.
అమాయక ఖాతాదారులను ఏమార్చి నేరగాళ్లు.. తమ అక్రమ కార్యకలాపాల నుంచి ఆర్జించిన సొమ్మును పొందడానికి, బదిలీ చేయడానికి వారి బ్యాంక్ ఖాతాలను వాడుకుంటూ ఉంటారు. మనకు తెలియకుండానే మోసపూరితంగా మన డాక్యుమెంట్లను వాడుకుని బ్యాంకుల్లో మన పేరిట ఖాతాలనూ తెరుస్తారు. వీటినే మ్యూల్ అకౌంట్స్ అంటారు. అయితే ఈ వ్యవహారాన్ని బ్యాంకులు గుర్తిస్తే సదరు ఖాతాలు మూతబడిపోతాయి. అంతేగాక దీంతో ప్రమేయంలేని అమాయకులు సమస్యల్లో పడుతారు. భవిష్యత్తులో వారికి బ్యాంకింగ్ లావాదేవీలు కష్టతరంగా మారుతాయి. ఇక ఇటీవలికాలంలో ఈ మ్యూల్ అకౌంట్స్ పెరిగిపోతున్నాయి.
గత ఏడాది పెద్దపెద్ద బ్యాంకుల్లో మోసపూరిత నగదు లావాదేవీలు భారీగానే జరిగినట్టు గుర్తించారు. అందుకే ఆన్లైన్ అకౌంట్ ఆన్‌బోర్డింగ్ సర్వీసు నిబంధనల్ని కఠినతరం చేస్తున్నామని బ్యాంక్ సిబ్బంది అంటున్నారు. డిజిటల్ బ్యాంకింగ్ మార్గాల ద్వారా నకిలీ డాక్యుమెంట్లతో ఖాతాలు తెరుస్తున్న వైనాన్ని అడ్డుకునే దిశగా బ్యాంకులు వెళ్తున్నాయని, అందుకే కస్టమర్లను నేరుగా సంప్రదించాకే ఖాతాలను తెరుస్తున్నాయని ఓ ఫ్రాడ్ డిటెక్షన్ స్టార్టప్ వ్యవస్థాపకుడు తెలిపారు.
మ్యూల్ ఖాతాలను గుర్తించి సకాలంలో వాటిని మూసేయకపోతే ఆర్బీఐ జరిమానా వేస్తున్నదని బ్యాంకర్లు చెప్తున్నారు. అందుకే ఆన్లైన్లో ఖాతాల కోసం వచ్చిన దరఖాస్తులపట్ల అప్రమత్తంగా ఉంటున్నామని పేర్కొంటున్నారు. అయినప్పటికీ కొత్త ఖాతాలకు డిజిటలైజేషన్ ఎంతో ముఖ్యమని కూడా వివరిస్తున్నారు. కాబట్టి కస్టమర్లను నేరుగా కలిసేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రధాన బ్యాంక్‌లోని ఓ ఉన్నతోద్యోగి తెలిపారు. ఇక ఖాతాదారులకు ఈ మోసాల గురించి అవగాహన కల్పిస్తున్నాయి బ్యాంకులు. కార్డ్ నెంబర్లు, ఏటీఎం పిన్ నెంబర్లు, ఓటీపీలు ఎవ్వరికీ చెప్పరాదని సూచిస్తున్నాయి.
కేంద్రంలో మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి బ్యాంకింగ్ వ్యవస్థలో ఆన్లైన్ ప్రాధాన్యత పెరిగిపోయింది. అన్నీ ఆన్లైన్లోనే అన్నట్టు తయారైంది. ఇక పాత పెద్ద నోట్ల రద్దుతో డిజిటల్ పేమెంట్స్ ఊపందుకున్నాయి. కానీ ఇదే సమయంలో బ్యాంక్ మోసాలు కూడా భారీగానే పెరుగడం గమనార్హం. అందరి చేతికి స్మార్ట్ఫోన్లు రావడంతో ఇంటర్నెట్ అంతటా విస్తరించింది. 4జీ, 5జీ సేవలు మొదలవడంతో ఇటీవలికాలంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) వాడకం సైతం పుంజుకున్నది. ఈ నేపథ్యంలో సైబర్ మోసగాళ్లు మరింత రెచ్చిపోతున్నారు. దీంతో బ్యాంకులు అప్రమత్తమవుతున్నాయి. ఇందులో భాగంగానే పాత సంప్రదాయ పద్ధతులే సురక్షితం అన్న అభిప్రాయానికి వచ్చేస్తున్నారు. అందుకే తమ డిజిటల్ ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్‌లోకి ఫిజికల్ చెక్స్ (భౌతికంగా పరిశీలనలు)ను పరిచయం చేస్తున్నారు.