బుధవారం 03 జూన్ 2020
Business - May 14, 2020 , 00:59:50

మార్కెట్లకు ఉద్దీపన జోష్‌

మార్కెట్లకు ఉద్దీపన జోష్‌

  • 637 పాయింట్లు పుంజుకున్న సెన్సెక్స్‌ 
  • మళ్లీ 32 వేల స్థాయికి సూచీ
  • 187 పాయింట్లు ఎగిసిన నిఫ్టీ

ముంబై, మే 13: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కరోనా ఉద్దీపన ప్యాకేజీ.. దేశీయ స్టాక్‌ మార్కెట్లలో ఉత్సాహం నింపింది. వరుస నష్టాల నుంచి తేరుకున్న సూచీలు.. బుధవారం లాభాల్లో ముగిశాయి. ఉదయం ఆరంభంలో బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ సెన్సెక్స్‌ 1,400 పాయింట్లకుపైగా పెరిగినప్పటికీ.. మదుపరుల లాభాల స్వీకరణతో సగానికిపైగా పడిపోయింది. ఈ క్రమంలోనే 637.49 పాయింట్ల వృద్ధితో 32,008.61 వద్ద ముగిసింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ నిఫ్టీ సైతం 187 పాయింట్లు పుంజుకుని 9,383.55 వద్ద స్థిరపడింది. దేశ ఆర్థిక వ్యవస్థను కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో మంగళవారం రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో మార్కెట్‌ సెంటిమెంట్‌ ఒక్కసారిగా బలపడింది. యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్‌ విలువ అత్యధికంగా 7.02 శాతం పెరిగింది. అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఎల్‌అండ్‌టీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్బీఐ, మహీంద్రా అండ్‌ మహీంద్రా, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లూ లాభాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ క్యాపిటల్‌ గూడ్స్‌, ఇండస్ట్రీ, బ్యాంకింగ్‌, రియల్టీ, ఫైనాన్స్‌ తదితర రంగాల షేర్లు 5.08 శాతం పెరిగాయి. హెల్త్‌కేర్‌, ఎఫ్‌ఎంసీజీ, టెలికం రంగాల షేర్లు నష్టపోయాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 1.97 శాతం లాభపడ్డాయి. అంతర్జాతీయంగా చైనా, దక్షిణ కొరియా సూచీలు లాభాల్లో ముగియగా, హాంకాంగ్‌, జపాన్‌ సూచీలు నష్టాలతో సరిపెట్టుకున్నాయి. ఐరోపా స్టాక్‌ మార్కెట్లూ నష్టాల్లోనే కదలాడుతున్నాయి.


logo