Sebi chief | అదానీ విదేశీ ఫండ్లలో స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ చైర్ పర్సన్ (Sebi chief) మాధాబీ పురీ బుచ్ (Madhabi Puri Buch), ఆమె భర్తకు వాటాలున్నాయని షార్ట్ సెల్లింగ్ సంస్ధ, మార్కెట్ రీసెర్చి కంపెనీ హిండెన్‌బర్గ్ నివేదిక దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెబీ చీఫ్‌కు ఇటీవలే పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (Public Accounts Committee) సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 24న విచారణకు తమ ముందు హాజరు కావాలని పేర్కొంది.
పీఏసీ ఆదేశాల మేరకు ఆమె ఇవాళ కమిటీ ముందు హాజరు కావాల్సి ఉంది. అయితే, ఆమె ఈ సమన్లను దాట వేశారు. కొన్ని వ్యక్తిగత కారణాల రీత్యా విచారణ కమిటీ ముందు హాజరు కాలేనని కమిటీకి తెలియజేశారు. దీంతో పీఏసీ చైర్పర్సన్, కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ సమావేశాన్ని వాయిదా వేశారు. ఈ విషయంపై కేసీ వేణుగోపాల్ (KC Venugopal) మాట్లాడుతూ.. ‘మొదటి కమిటీ సమావేశంలో రెగ్యులేటరీ పనితీరుపై సమీక్షించాలని నిర్ణయించుకున్నాం. సెబీ సమీక్ష కోసం సంబంధిత వ్యక్తులకు నోటీసులు పంపాం. అయితే, వారు సమావేశం నుంచి మినహాయింపు కోరారు. దాన్ని మేం తిరస్కరించాం.
ఆ తర్వాత కమిటీ ముందు తాను, తన బృందం హాజరవుతామని సెబీ చీఫ్ ధృవీకరించారు. వ్యక్తిగత అత్యవసర పరిస్థితి కారణంగా ఆమె ఢిల్లీకి ప్రయాణించే పరిస్థితి లేదని ఇతర సభ్యుల నుంచి ఈరోజు ఉదయం 9:30 గంటలకు మాకు సమాచారం అందింది. ఆమె అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని, నేటి సమావేశాన్ని వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాము. మరొక రోజు సమావేశం ఏర్పాటు చేస్తాం’ అని ఆయన తెలిపారు.
అదానీ గ్రూప్ ఆర్థిక అవకవతవకల్లో భాగస్వామిగా ఉన్న ఆఫ్ షోర్ కంపెనీల్లో మాధాబీ పురీ బుచ్ దంపతులకు వాటాలు ఉన్నాయని హిండెన్ బర్గ్ ఆరోపణ. ఈ విషయమై అదానీ గ్రూపుపై ఆరోపణలు వచ్చిన తర్వాత 18 నెలలకు కూడా ఆ గ్రూప్ సంస్థలపై వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడంలో సెబీ నిరాసక్తతను ఇది తెలియజేస్తున్నదని హిండెన్ బర్గ్ పేర్కొంది.
Also Read..
Bengaluru | ట్రాఫిక్ జామ్.. వాహనాలను వదిలి నడుచుకుంటూ ఇంటికి వెళ్లిన ప్రయాణికులు.. VIDEO
Justin Trudeau | కెనడా ప్రధాని ట్రూడోకు సొంత పార్టీ ఎంపీలు అల్టిమేటం.. రాజీనామా చేయాలంటూ డెడ్‌లైన్
Trash balloons | సియోల్‌లోని అధ్యక్ష కార్యాలయంపై పడిన చెత్త బెలూన్