Justin Trudeau | ఖల్థిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో భారత్ – కెనడా మధ్య సంబంధాలు (India – Canada row) తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ హత్యలో భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాన జస్టిన్ ట్రూడో (Justin Trudeau)నే స్వయంగా ఆరోపణలు చేయడం సంచలనం సృష్టించింది. ట్రూడో ఆరోపణలతో రెండేళ్లుగా భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే ట్రూడో ఆరోపణలను మాత్రం భారత్ ఎప్పటికప్పుడు కొట్టి పారేస్తోంది. ఈ వివాదాల నేపథ్యంలో.. ఇప్పుడు కెనడా ప్రధాని చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది.
కెనడా అధికార లిబరల్ పార్టీ (Liberal party)కి చెందిన కొందరు సభ్యులు జస్టిన్ ట్రూడోకు అల్టిమేటం (ultimatum) జారీ చేశారు. ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలని లేదంటే తిరుగుబాటు చేస్తామంటూ హెచ్చరించారు. ఈ మేరకు డెడ్‌లైన్ కూడా పెట్టారు. అక్టోబర్ 28లోగా రాజీనామా చేయాలని తేల్చి చెప్పినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ట్రూడో రాజీనామా చేయాలన్న లేఖపై మొత్తం 153 మంది ఎంపీల్లో 24 మంది సంతకాలు చేసినట్లు ది గార్డియన్ తెలిపింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమిని ఊహించి రాజీనామా చేయాల్సిందిగా ప్రధానిని కోరినట్లు పేర్కొంది.
కాగా, వచ్చే ఏడాది అక్టోబర్‌లో కెనడా పార్లమెంట్‌కు ఎన్నికలు జరగనున్నాయి. ఇక గత ఎన్నికల్లో ప్రధాని జస్టిన్ ట్రూడో సార్థ్యంలోని లిబరల్ పార్టీ తిరుగులేని విజయం సాధించిన విషయం తెలిసిందే. ట్రూడో వరుసగా మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకున్నారు. అయితే, ఆ ఎన్నికల్లో ఆయన పార్టీ సొంతంగా పూర్తి మెజారిటీ సాధించలేకపోయింది. కరోనా నియంత్రణలో సమర్థంగా చర్యలు తీసుకున్నందుకు ప్రజలు పూర్తిస్థాయి మెజారిటీ కట్టబెడతారన్న నమ్మకంతో ట్రూడో మధ్యంతర ఎన్నికలకు వెళ్లారు.
ఆయన మైనారిటీ ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేకపోయినా ‘మధ్యంతర’ నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే, ఇప్పుడు నాలుగోసారి అధికారం కోసం ట్రూడో సిద్ధమవుతున్నారు. కానీ, కెనడా చరిత్రలో గత 100 ఏళ్లలో ఏ నాయకుడూ నాలుగోసారి గెలిచిన దాఖలాలు లేవు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని లిబరల్ ఎంపీలు.. ట్రూడోను రాజీనామా చేయాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది.
Also Read..
KTR | ఏడో బెటాలియన్‌లో కానిస్టేబుళ్ల భార్యల ఆందోళన.. సంఘీభావం ప్రకటించిన కేటీఆర్
Cyclone Dana | తీవ్ర తుఫాన్‌గా దానా.. ఒడిశాలోని ఆ రెండు ఆలయాలు మూసివేత
India Post | ఇండియా పోస్ట్‌కు షాక్.. అర్ధ రూపాయి చెల్లించనందుకు రూ.15,000 ఫైన్