UPI Payments | నోట్ల రద్దు తర్వాత.. ప్రత్యేకించి కరోనా మహమ్మారి ప్రభావంతో డిజిటల్ చెల్లింపులు పుంజుకున్నాయి. డిజిటలైజ్డ్ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పలు రంగాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయి. డిజిటల్ పేమెంట్స్ సేఫ్టీ.. సులభం కూడా.. అయితే, ఈ చెల్లింపులపైనా వాటి భద్రతపైనా పలు సందేహాలు, అనుమానాలు ఉన్నాయి. కనుక డిజిటల్ పేమెంట్స్ విషయంలో ప్రతి ఒక్కరూ జాగరూకతతో వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు.
కొత్తగా యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపులు జరుపుతున్న వారు గందరగోళానికి గురవుతుంటారు. క్యాష్ రిసీవ్ చేసుకోవడానికి బదులు పేమెంట్స్ చేసి ఇబ్బందుల్లో చిక్కుకుంటారు. ఈ సమస్య నుంచి బయట పడటానికి మార్గాలు ఉన్నాయి. యూపీఐ ద్వారా డబ్బు పొందడానికి మీ పిన్ నంబర్ నమోదు చేయాల్సిన అవసరమే లేదు. అది ఏ రకమైన లావాదేవీ.. ఎవరికి చెల్లిస్తున్నారో ముందుగా ధ్రువీకరించుకోవాలి. అవతలి వ్యక్తిపై సందేహాలు వస్తే చెల్లింపులు చేయబోమని తిరస్కరించాలి.
సందేహస్పద యాప్ నుంచి గానీ, వెబ్సైట్ ద్వారా గానీ చెల్లింపులు చేయొద్దు. యాప్ స్టోర్ నుంచి విశ్వసనీయమైన యాప్‌లను మాత్రమే డౌన్లోడ్ చేసుకుని, వాటితో మాత్రమే పేమెంట్స్ చేయాలి. https: //తో మొదలయ్యే వెబ్సైట్ల నుంచి చెల్లింపులు చేయాలి. పేమెంట్స్ అయ్యాక లాగౌట్ చేయడం మరిచిపోవద్దు.
యూపీఐ యాప్స్‌ను అనునిత్యం అప్డేట్ చేసుకోవాలి. యాప్ యాజమాన్యాలు భద్రతాపరమైన లోపాలను సరి చేసి కూడా అప్డేట్స్ అందిస్తున్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో మీరు మీ పిన్ ఇతరులతో షేర్ చేసుకోవద్దు. తరుచుగా పిన్ మార్చుకోవడం మీ డబ్బు భద్రతకు శ్రేయస్కరం అని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. అప్పుడే సైబర్ మోసాల నుంచి రక్షణ లభిస్తుంది. ఎవరు యూపీఐ పిన్ అడిగినా, ఐడీ అడిగినా చెప్పొద్దు. వన్‌టైం పాస్వర్డ్ ద్వారా పేమెంట్స్‌కు ప్రాధాన్యం ఇస్తే మరీ మంచిది.
ప్లేస్టోర్లలో నకిలీ యాప్‌లు ఉంటాయి. వాటిలో నకిలీ యాప్‌లను గుర్తించడం కూడా తేలికే. వెరిఫైడ్ యాప్‌లను మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి. నెగెటివ్ రివ్యూలు, వెరిఫైడ్ బ్యాడ్జెస్ లేకపోవడం, తక్కువ డౌన్లోడ్లు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని నకిలీ యాప్‌లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.