న్యూఢిల్లీ, నవంబర్ 25: గత మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన పుత్తడి మళ్లీ భగ్గుమన్నది. ప్రాంతీయ ఆభరణాల వర్తకులు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతోపాటు పెండ్లిండ్ల సీజన్ రావడంతో కొనుగోళ్లు భారీగా పుంజుకున్నాయి. దీంతో దేశీయంగా ఒక్కసారిగా బంగారం ధర భారీగా పెరిగింది. దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో పదిగ్రాముల పుత్తడి ధర మంగళవారం ఒకేరోజు రూ.3,500 ఎగబాకి రూ.1,28,900 గా నమోదైంది. అలాగే 99.5 శాతం స్వచ్ఛత కలిగిన గోల్డ్ ధర కూడా అంతే స్థాయిలో ఎగబాకి రూ.1,28,300 పలికింది. ఇటు హైదరాబాద్లో గోల్డ్ ధర రూ.2 వేల వరకు అధికమైంది. 24 క్యారెట్ కలిగిన పదిగ్రాముల ధర రూ.1,910 అందుకొని రూ.1,27,040కి చేరుకోగా, 22 క్యారెట్ ధర రూ.1,750 ఎగబాకి రూ.1,16,450కి చేరుకున్నది.
డాలర్ బలహీనపడటంతో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్మెంట్లను సురక్షితమైన పుత్తడి వైపు మళ్లించడం, అమెరికా ఫెడరల్ రిజర్వు ఇప్పట్లో వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు కూడా లేకపోవడం కూడా ధరలు పెరగడానికి ప్రధాన కారణాలని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ దేశీయంగా పెరగడం విశేషం. ఔన్స్ గోల్డ్ ధర 4,131 డాలర్లు పలుకగా, వెండి 51.15 డాలర్లుగా నమోదైంది.
బంగారంతోపాటు వెండి వెలుగులు జిమ్మింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో కిలో వెండి ఏకంగా రూ.5,800 ఎగబాకి రూ.1,60,800కి చేరుకున్నది. అలాగే హైదరాబాద్లో కిలో వెండి రూ.3 వేలు అందుకొని రూ.1.78 లక్షలుగా నమోదైంది. మరోవైపు, ఫ్యూచర్ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరల దూకుడు కొనసాగింది. ఫ్యూచర్ మార్కెట్లో పదిగ్రాముల గోల్డ్ ధర రూ.1,458 ఎగబాకి రూ.1,25,312కి చేరుకున్నది.