– డిమాండ్స్ డే నిరసన
నల్లగొండ సిటీ, నవంబర్ 26 : విద్యుత్ బస్సుల విధానంలో మార్పులు చేసి వాటి నిర్వహణను ఆర్టీసీకే ఇవ్వాలని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నల్లగొండ డిపో గౌరవాధ్యక్షుడు దండెంపల్లి సత్తయ్య, రాష్ట్ర కోశాధికారి కె ఎస్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్లగొండ బస్ డిపోలో ఆర్టీసీ కార్మికులు డిమాండ్ డే సందర్భంగా బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్మిక వ్యతిరేఖ నాలుగు లేబర్ కోడ్లను అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గెజిట్స్ ను రద్దు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ లేబర్ పాలసీ “శ్రమ శక్తి నీతి – 2025” ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
టీజీఎస్ఆర్టీసీ లో కార్మిక సంఘాలపై ఉన్న ఆంక్షలు ఎత్తివేసి సీసీఎస్‌కు ఎన్నికలు జరపాలని కోరారు. రిటైర్డ్ అయిన వారికి రావాల్సిన అన్ని రకాల బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. 2021, 2025 వేతన ఒప్పందాలను చేయాలని, 2017 అలవెన్సులు సవరించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేయాలనే కుట్రలు మానుకోవాలని ప్రజా రవాణా సంస్థను కాపాడాలని జరుగుతున్న పోరాటంలో ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రీజియన్ అధ్యక్షుడు కందుల నరసింహ, సహాయ కార్యదర్శి కె.శ్యాంసుందర్, డిపో కార్యదర్శి గులాం రసూల్, అధ్యక్షుడు ఎం.నరసింహయ్య, ఉపాధ్యక్షులు ఎండీ.ఇక్బాల్, రావుల నరసింహ, సీఐటీయూ నాయకుడు కత్తుల యాదయ్య పాల్గొన్నారు.