ముంబై, నవంబర్ 25: టాటా మోటర్స్ తమ పాత మాడల్ సియెర్రాను మంగళవారం సరికొత్తగా మార్కెట్‌కు పరిచయం చేసింది. ఎక్స్‌షోరూం ప్రారంభ ధర రూ.11.49 లక్షలు. ఇక ఈ 5-డోర్ ఎస్యూవీ బుకింగ్స్ వచ్చే నెల డిసెంబర్ 16 నుంచి మొదలవనున్నాయి. వచ్చే ఏడాది జనవరి 15 నుంచి డెలివరీలుంటాయని కంపెనీ తెలియజేసింది. ప్రస్తుతమున్న టాటా హారియర్, సఫారీల కంటే తక్కువ ధరకే ఈ మాడల్ అందుబాటులో ఉండనుండగా.. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్‌లకు ప్రత్యామ్నాయంగా ఉందని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి.
కాగా, వచ్చే నెలలోనే ఈ నయా మాడల్లోని అన్ని వేరియంట్ల ధరలు బయటకు వచ్చే వీలున్నది. ఇక ఇందులో అత్యాధునిక 1.5 లీటర్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్లున్నాయి. కాగా, 1991లో తొలిసారి సియెర్రా మాడల్‌ను టాటా తీసుకొచ్చింది. అయితే 2003 నుంచి దీన్ని ఆపేశారు. మళ్లీ రెండు దశాబ్దాల తర్వాత రీ-ఎంట్రీ ఇచ్చింది.