మాగనూరు : అనుమతులు లేకుండా ఇసుకను ఎలా తరలిస్తారని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి( Chittem Rammohan Reddy) రాఘవ కన్స్ట్రక్షన్కు (Raghava Construction) చెందిన ఇసుక ట్రిప్పర్లు ( Sand Tippers ) అడ్డుకొని పోలీసులకు అప్పగించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి హైకోర్టులోనే పర్మిషన్ లేదని అలాంటిది మాగనూరు పెద్దవాగులో ఇసుక ఎక్కడికి తరలిస్తున్నారని ట్రిప్పర్ డ్రైవర్ను ఆపి ప్రశ్నిం చారు. సరైన పత్రాలు చూపించక పోవడంతో మాగనూరులోని సంబంధిత అధికారులను వివరణ అడగగా వారి నుండి కూడా సరైన సమాధానం రాకపోవడంతో మాగనూరు ఎస్సై అశోక్ బాబుకు ఫోన్ చేశారు.
ఇసుక ట్రిప్పలను అడ్డుకుంటే కేసులు నమోదు చేయాల్సి వస్తుందని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డికి ఎస్సై వివరించారు. అక్రమంగా ఇసుకను తరలిస్తే ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోవాలని వెల్లడించారు. అనంతరం నారాయణపేట జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఫోన్ చేసి వివరాలు అడగగా రాఘవ కన్స్ట్రక్షన్కు ఇసుక తరలింపునకు పరిమిషన్ లేదని కలెక్టర్ సీసీ తెలిపినట్లు మాజీ ఎమ్మెల్యే వివరించారు.
మద్రాస్ క్రిమినల్ కోర్టు నుంచి రాఘవ మెగా కంపెనీకి తరలిస్తున్న ఇసుకను అడ్డుకోవాలని మాగనూరు ఎస్సై, తహసీల్దార్, సీఐకి లెటర్లు కూడా పంపించినా అధికారులు వాటిని అడ్డుకోకుండా చేతులు కట్టుకొని చూస్తున్నారని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో మాగనూరు పెద్ద వాగు ఎడారి ప్రాంతంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, సాగునీరు లేక రైతులు అల్లాడి పరిస్థితి నెలకొంటుందని మండిపడ్డారు.
ఇసుక దోపిడీ జరుగుతుంటే పోలీస్, రెవెన్యూ శాఖ సంబంధిత అధికారులు సైతం అధికార పార్టీకి తొత్తులుగా మారారని విమర్శించారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వాహనాలను సీజ్ చేసి స్టేషన్కు తరలించాలని మాగనూరు ఏఎస్సై తో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. చివరకు తహసీల్దార్ సురేష్ ఆదేశాల మేరకు ఇసుక ట్రిప్పర్లను పోలీస్ స్టేషన్ కు తరలించారు.