న్యూఢిల్లీ : ఓవైపు నిత్యావసరాల ధరలు భగ్గుమంటుంటే తాజాగా ఉల్లి ధరలు (Onion Prices) ఆకాశానికి ఎగబాకడంతో సామాన్యుడు తల్లడిల్లే పరిస్ధితి నెలకొంది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై వంటి మహా నగరాలు సహా దేశవ్యాప్తంగా ఉల్లి రిటైల్ ధరలు సగటున కిలో రూ. 80 పలకడంతో సగటు జీవి ఉల్లి అంటేనే ఉలికిపడుతున్నాడు.
ఉల్లి సగటు ధర గణనీయంగా పెరిగిందని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ డేటా కూడా వెల్లడించింది. ఉల్లి ధరలు రోజురోజుకూ పెరుగుతుండటం గృహిణులకు కంటనీరు తెప్పిస్తోంది. ఉల్లి నిల్వలు తగినంతగా లేకపోవడం, సరఫరాలు మందగించడంతోనే ఉల్లి ధరలు అమాంతం పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. డిసెంబర్లో కొత్త పంట మార్కెట్‌కు తరలివచ్చే వరకూ మరికొద్ది రోజులు ఉల్లి కొరత వెంటాడుతుందని రైతులు, హోల్‌సేల్ వ్యాపారులు పేర్కొంటున్నారు.
రెండు నెలల పాటు ఉల్లి ధరలు భగ్గుమనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఉల్లి ధరలు నిలకడగా ఉండేలా చూసేందుకు వినియోగదారుల వ్యవహారాల శాఖ ఉల్లి ఎగుమతులు, ధరలను నిశితంగా పరిశీలిస్తోంది. మరోవైపు ఉల్లికి పెరిగిన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని మండి సేల్స్ ద్వారా మిగులు నిల్వలను మార్కెట్లోకి విడుదల చేసేందుకు వినియోగదారుల వ్యవహారాల శాఖ సన్నాహాలు చేస్తోంది. ఉల్లి ధరలను నియంత్రించి వినియోగదారుల ప్రయోజనాలు కాపాడేందుకు నాఫెడ్, ఎన్సీసీఎఫ్ సైతం ఉల్లి సేకరణకు కసరత్తు సాగిస్తున్నాయి.
Read More :
CM Kejriwal: సీఎం కేజ్రీవాల్‌ను అరెస్టు చేస్తారు: ఢిల్లీ మంత్రి ఆతిషి