ITR | 2024-25 అసెస్మెంట్ సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడానికి గడువును ఆగస్టు 31 వరకు పొడిగించాలని ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ టాక్స్ ప్రాక్టీషనర్స్ (AIFTP) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT)ని కోరింది. పలు రాష్ట్రాల్లో వరదలు రిటర్న్ ఫైలింగ్ ప్రక్రియపై తీవ్ర ప్రభావం చూపాయని ఏఐఎఫ్‌టీపీ జాతీయ అధ్యక్షుడు నారాయణ జైన్, నారాయణ్ జైన్, డైరెక్ట్ ట్యాక్స్ రిప్రజెంటేషన్ కమిటీ చైర్మన్ ఎస్ఎం సురానా పేర్కొన్నారు. ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడడంతో ఈ కష్టాలు మరింతగా పెరిగాయన్నారు. ఆదాయపు పన్ను పోర్టల్, సాఫ్ట్‌వేర్‌లో సమస్యలు ఉన్నాయని, వివిధ ఫారమ్‌లను డౌన్లోడ్ చేయడం, ధ్రువీకరణలో ఇబ్బందులు ఉన్నాయని ఓ మెమోరాండంలో పేర్కొన్నారు. అదే సమయంలో బ్యాంకుల ద్వారా సెల్ఫ్ అసెస్మెంట్ పన్ను చెల్లింపు, చలాన్లను డౌన్లోడ్ చేసే ప్రక్రియకు సైతం సమయం పడుతుందని తెలిపారు.
ఇదిలా ఉండగా వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు 2024-25 అసెస్మెంట్ ఇయర్‌కు సంబంధించిన ఐటీఆర్ దాఖలు చేసేందుకు ఈ నెల 31తో గడువు ముగియనున్నది. గడువులోగా ఐటీఆర్ దాఖలు చేయకపోతే జరిమానా విధించే అవకాశం ఉన్నది. ఈ క్రమంలో ఐటీఆర్‌ను ఫైల్ చేయడంలో సాంకేతిక సమస్యలు, ఇతర అవాంతరాల నేపథ్యంలో ఆదాయపు పన్ను చెల్లింపుదారులు గడువు పొడిగించాలని కోరుతున్నారు. అయితే, ఈ విషయంలో ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన చేయలేదు. గడువులోగా ఐటీఆర్ దాఖలు చేయలేకపోతే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 234A జరిమానా, వడ్డీ సైతం చెల్లించాల్సి రానున్నది. అదనంగా సెక్షన్ 234ఎఫ్ లేట్ ఫీజును సైతం విధిస్తుంది. ఆదాయాన్ని బట్టి రూ.1,000 నుంచి రూ.5వేల జరిమానా విధించే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా పలు తగ్గింపులు, మినహాయింపులను క్లెయిమ్ చేసే అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది.