న్యూఢిల్లీ, జూలై 29: హల్దీరామ్స్ చేతులు మారబోతున్నది. అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్‌స్టోన్.. దేశీయ స్నాక్స్ మార్కెట్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడంలో భాగంగా హల్దీరామ్స్‌లో మెజార్టీని కొనుగోలు చేయడానికి సిద్ధమైంది. ఇందుకు సంబంధించి 51 శాతం వాటాను కొనుగోలుకు బిడ్డింగ్ దాఖలు చేసింది. హల్దీరామ్స్ విలువ రూ.70-78 వేల కోట్ల స్థాయిలో ఉంటుందని అంచనా. దీంతో ఈ వాటా కోసం బ్లాక్‌స్టోన్ రూ.40 వేల కోట్ల వరకు నిధులు వెచ్చించనున్నది.
ఇండియన్ బ్యాంక్ ఆకర్షణీయం
న్యూఢిల్లీ, జూలై 29: ఇండియన్ బ్యాంక్ ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.2,403 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,709 కోట్ల లాభంతో పోలిస్తే 41 శాతం వృద్ధిని కనబరిచింది. ఏడాది క్రితం రూ.14,759 కోట్లు ఆర్జించిన బ్యాంక్ ఆదాయం గత త్రైమాసికానికి రూ.16,945 కోట్లకు పెరిగింది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 5.47 శాతం నుంచి 3.77 శాతానికి తగ్గగా, నికర ఎన్పీఏ 0.70 శాతం నుంచి 0.39 శాతానికి దిగొచ్చింది.
గ్రాండ్ విటారా @ 2 లక్షల యూనిట్లు
న్యూఢిల్లీ, జూలై 29: మారుతి సుజుకీ చెందిన మరో మాడల్ సత్తా చాటింది. మధ్యస్థాయి ఎస్యూవీ గ్రాండ్ విటారాకు కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభించింది. మార్కెట్లోకి విడుదల చేసిన 23 నెలల్లోనే 2 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయని కంపెనీ వెల్లడించింది. తొలి లక్ష యూనిట్లు ఏడాదిలోగా అమ్ముడవగా, మరో లక్ష యూనిట్లకు 11 నెలల సమయం పట్టిందని తెలిపింది.