Gold Demand | ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో గ్లోబల్ గోల్డ్ డిమాండ్ 4.16శాతం పెరిగి 1,258.2 టన్నులకు చేరుకుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) వెల్లడించింది. గోల్డ్ కౌన్సిల్ సెకండ్ క్వార్టర్-2024 2024 గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ నివేదిక ప్రకారం.. 2023 రెండవ త్రైమాసికంలో మొత్తం డిమాండ్ 1,207.9 టన్నులుగా నమోదైంది. 2020లో డిమాండ్ 1,258.2 టన్నులకు పెరిగింది. సమీక్షలో ఉన్న త్రైమాసికంలో బంగారం ధరలు సంవత్సరానికి 18శాతం పెరిగాయి. సగటున ఔన్స్ 2,338 డాలర్లు ఉండగా.. ఈ త్రైమాసికంలో ఔన్సు రికార్డు స్థాయిలో 2,427 డాలర్లకు చేరిందని నివేదిక పేర్కొంది.
ఓటీసీ డిమాండ్ పెరగడం, సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లను కొనసాగించడం, ఈటీఎఫ్ అవుట్‌ఫ్లో తగ్గడం తదితర కారణాలతో ఈ ఏడాది రెండో త్రైమాసికంలో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయని నివేదిక పేర్కొంది. గ్లోబల్ గోల్డ్ ఈటీఎఫ్ (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్) సమీక్షా త్రైమాసికంలో స్వల్పంగా ఏడు టన్నుల ఉపసంహరణలు నమోదయ్యాయి. సెంట్రల్ బ్యాంకులు, ఓటీసీ మార్కెట్ నుంచి బలమైన డిమాండ్ కారణంగా బంగారం ధరలు పెరిగాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సీనియర్ మార్కెట్ అనలిస్ట్ లూయిస్ స్ట్రీట్ తెలిపారు. భవిష్యత్తులో బంగారానికి పలు సవాళ్లు ఉన్నాయని.. కానీ ప్రపంచ మార్కెట్లో కూడా మార్పులు జరుగుతున్నాయన్నారు.
ఇవి బంగారం డిమాండ్‌కు మద్దతునిస్తాయన్నారు. మరో వైపు జూన్ త్రైమాసికంలో భారతదేశంలో బంగారం డిమాండ్ 5శాతం తగ్గి టన్నులకు పడిపోయిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదికలో పేర్కొంది. బంగారం డిమాండ్ విలువ రూ.82,530 కోట్ల నుంచి 17శాతం పెరిగి రూ.93,850 కోట్లకు చేరింది. పెట్టుబడులపై డిమాండ్ 46శాతం పెరిగి 43.1 టన్నులకు చేరుకుంది. అధిక ధరలు, ఎన్నికల సమయం, తీవ్రమైన వడగాల్పుల కారణంగా ఆభరణాల డిమాండ్ 17శాతం క్షీణించి 106.5 టన్నులకు తగ్గింది. కేంద్రం బంగారంపై దిగుమతి సుంకాలను తగ్గింపు నేపథ్యంలో భవిష్యత్‌లో డిమాండ్‌ను పెంచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.