హైదరాబాద్, జూలై 29: తెలంగాణలోకి యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రవేశించింది. హైదరాబాద్‌లో సోమవారం ఒకేరోజు ఐదు శాఖలను ప్రారంభించింది. ఈ సందర్భంగా బ్యాంక్ ఎండీ, సీఈవో ఇంద్రజిత్ కమోత్రా మాట్లాడుతూ..వ్యాపార విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో దిల్సుఖ్నగర్, ఎస్ఆర్ నగర్, మౌలాలి, సుచిత్ర క్రాస్‌రోడ్, కూకట్‌పల్లిలో శాఖలను తెరిచినట్లు చెప్పారు.
ఎంఎస్ఎంఈలకు సులభంగా రుణాలు అందించాలనే ఉద్దేశంతో ప్రత్యేక మొబైల్ యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు, దీంతో వేగవంతంగా రుణం మంజూరు చేయడానికి వీలు పడనున్నదన్నారు. అలాగే వచ్చే మూడు నెలల్లోనే హైదరాబాద్‌లో మరో మూడు, ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్, విజయవాడల్లోనూ శాఖలను ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతోపాటు వచ్చే మూడు నెలల్లో క్రెడిట్ కార్డుతోపాటు వ్యక్తిగత రుణాలు కూడా మంజూరు చేసే ఆలోచనలో బ్యాంక్ ఉన్నదన్నారు. లక్ష నుంచి రూ.5 లక్షల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై 9.50 శాతం వరకు వడ్డీని, పొదుపు ఖాతాలపై 7.50 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నది.