Infosys | దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ (Infosys) ఇటీవలే తరచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఉద్యోగులు వారానికి 70 గంటలు పనిచేయాలంటూ ఇటీవలే ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యల నుంచి.. ఉద్యోగులకు లేఆఫ్స్, ఫ్రెషర్స్ విషయంలో సంస్థ తీరు, శాలరీ హైక్‌లు వంటి కారణాలతో నిత్యం హెడ్‌లైన్స్‌లో నిలుస్తోంది. ఇప్పుడు తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. ఉద్యోగులు నెలలో కనీసం పది రోజులు ఆఫీస్‌కు రావాలని సంస్థ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
కరోనా మహమ్మారి కారణంగా 2020 ఏడాది పలు ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. మహమ్మారి వ్యాప్తి పూర్తిగా అదుపులోకి రావడంతో కొన్ని సంస్థలు హైబ్రిడ్ పద్ధతిని అవలంభిస్తున్నాయి. వారానికి కనీసం రెండు, మూడు రోజులైనా కార్యాలయాలకు వచ్చి పనిచేయాల్సిందేనని స్పష్టం చేస్తున్నాయి. టీసీఎస్, విప్రో వంటి టాప్ సంస్థలు ఇప్పటికే ఉద్యోగుల్ని ఆఫీసుకు వచ్చి పనిచేయాలని సూచించాయి. ఇన్ఫోసిస్ కూడా గతంలో తమ ఉద్యోగులకు ఇలాంటి సూచనే చేసింది. ఉద్యోగులు వారంలో కనీసం మూడు రోజులు ఆఫీసుకు రావాలని ఆదేశించింది. ఇప్పుడు కార్యాలయాల నుంచి మరింత మంది ఉద్యోగులు పనిచేసేలా చూసేందుకు ఇన్ఫీ చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగా నెలలో కనీసం 10 రోజుల పాటు ఉద్యోగులు తప్పనిసరిగా ఆఫీసు నుంచే పనిచేసే (work from office) విధంగా చూడాలని టెక్నాలజీ టీమ్‌ను ఇన్ఫోసిస్ తాజాగా ఆదేశించినట్లు తెలిసింది. ప్రతి నెల అందరినీ ఆఫీస్‌కు రప్పించాలనే ఉద్దేశంతోనే ఇన్ఫోసిస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మార్చి 10 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులకు కొత్త హైబ్రిడ్ పని పద్ధతులతో ఈ వ్యవస్థను అమలు చేయనున్నారు. ఉద్యోగులకు ఫ్లెక్సిబిలిటీ ఉండేలా నెలలో 10 రోజులు ఆఫీస్ నుంచి, మిగతా రోజులు ఇంటి నుంచే పని చేసుకునే వెసులుబాటు కల్పించాలని సంస్థ నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి.
ప్రస్తుతం ఇన్ఫీ ఉద్యోగులు అటెండెన్స్ కోసం మొబైల్ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే ఇకపై ఇది డీఫాల్ట్‌గా వర్క్ ఫ్రం హోమ్ రెక్వెస్ట్‌ను ఆమోదించదు. నెలలో కచ్చితంగా 10 రోజులు ఆఫీస్‌కు వెళ్లి పంచ్ వేయాలని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఒకవేళ నెలలో కార్యాలయానికి రావాల్సిన రోజుల్లో ఒకటి లేదా రెండు రోజులు తగ్గితే.. వాటిని ఉద్యోగి సెలవుల నుంచి మినహాయిస్తారు. అయితే, ఈ నిర్ణయంపై ఇన్ఫోసిస్ అధికారికంగా ఎలాంటి ప్రకనటా చేయలేదు.
Also Read..
Dependents | భారతీయుల పిల్లలకు బహిష్కరణ ముప్పు.. ట్రంప్ విధానాలతో భవిష్యత్తు అగమ్యగోచరం!
Pune | బొట్టు, తాళి ధరించకపోతే ఎలా.. నీ భర్త నీపై ఎందుకు ఆసక్తి చూపుతాడు?
Bengaluru | ఇక్కడ రియల్ ఎస్టేట్, రాజకీయ చర్చలొద్దు.. దయచేసి అర్థం చేసుకోండి..