Dependents | న్యూఢిల్లీ, మార్చి 6: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న దుందుడుకు నిర్ణయాలు యూఎస్‌లో నివసిస్తున్న లక్షలాది భారతీయుల్లో గుబులు రేపుతున్నాయి. అమెరికాలో వలసదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న ట్రంప్ యంత్రాంగం.. వీసా గడువు ముగిసినా ఇంకా తమ దేశంలోనే ఉంటున్నవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నది. హెచ్1బీ వీసాలున్న తల్లిదండ్రులతోపాటు మైనర్లుగా అమెరికా వెళ్లిన వారు ఇప్పుడు 21 ఏండ్లు నిండటంతో తిరిగి స్వదేశం రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. 21 ఏండ్లు దాటిన తరువాత వారిని డిపెండెంట్లుగా పరిగణించరు. ఇలాంటి భారతీయులు ప్రస్తుతం అమెరికాలో లక్షకుపైగా ఉన్నట్టు అంచనా. వీరందరూ ప్రస్తుతం బహిష్కరణ ముప్పును ఎదుర్కొంటున్నారు.
21 ఏండ్లు దాటిన వీరి వీసా పునరుద్ధరణకు రెండేండ్ల గడువు ఉంటుంది. కానీ ఇటీవల ట్రంప్ ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ విధానంలో మార్పులు చేయడంతో వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. హెచ్1బీ వీసా ఉన్న వీరి తల్లిదండ్రులు సైతం శాశ్వత నివాసం (గ్రీన్‌కార్డు) అర్హత పొందేందుకు ప్రస్తుత పరిస్థితిని బట్టి 12 నుంచి 100 ఏండ్ల సమయం పట్టవచ్చని అంటున్నారు. దీనికితోడు డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్ (డీఏసీఏ) కింద వర్క్ పర్మిట్ల కోసం వచ్చే కొత్త దరఖాస్తులను అనుమతించరాదని టెక్సాస్‌కు చెందిన ఓ కోర్టు ఇటీవల రూలింగ్ ఇచ్చింది. దీంతో ఇప్పటివరకు డిపెండెంట్లు సహా సరైన పత్రాలు లేని వలసదారులకు రక్షణగా ఉన్న డీఏసీఏ నిబంధన ఇప్పుడు తొలగిపోయింది. ఇప్పుడు ఈ నిబంధన కూడా లేకపోవడంతో అమెరికాలోని భారతీయ యువత తప్పనిసరిగా స్వదేశానికో లేదా మరో ఇతర దేశానికో వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. 2026 ఆర్థిక సంవత్సరం కోసం యూఎస్సీఐఎస్ ఇటీవల హెచ్1బీ వీసాల రిజిస్ట్రేషన్‌ను ప్రకటించింది. ఈ ప్రక్రియ ఈ నెల 7 నుంచి 24వరకు కొనసాగనుంది.
అక్రమ వలసదారుల తరలింపునకు ఇక మిలిటరీ విమానాలు వినియోగించరాదని ట్రంప్ సర్కారు నిర్ణయించినట్టు సమాచారం. సీ-17, సీ-130 యుద్ధ విమానాల్లో అక్రమ వలసదారులను తరలించేందుకు భారీగా ఖర్చు అవుతున్నదని, దీంతో ఈ విమానాలను ఇక వినియోగించరాదని ప్రభుత్వం నిర్ణయించినట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అక్రమ వలసదారులతో చివరి మిలటరీ ఫ్లైట్ మార్చి 1న వెళ్లినట్టు ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ కథనం తాజాగా తెలిపింది. అక్రమ వలసదారులపై ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. ఇండియాతోపాటు పెరూ, గ్వాటెమాల, హోండురాస్, పనామా, ఈక్వెడార్ తదితర దేశాలకు చెందిన అక్రమ వలసదారులను చేతలకు బేడీలు వేసి, కాళ్లకు గొలుసులు వేసి యుద్ధవిమానాల్లో వారి సొంత దేశాలకు పంపించి వేశారు.