Bengaluru | బెంగళూరు, మార్చి 6: కొన్ని హోటళ్ల ప్రత్యేకమైన నిబంధనలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రాచుర్యం పొందుతాయి. బెంగళూరులోని ‘పాకశాల’ అనే రెస్టారెంట్ కస్టమర్లకు చేసిన అలాంటి ఓ సూచన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ‘ఈ సౌకర్యం భోజనం చేయడానికి మాత్రమే. రియల్ ఎస్టేట్, రాజకీయాల గురించి చర్చించడానికి కాదు. దయచేసి అర్థం చేసుకొని సహకరించండి’ అన్న ఆ హోటల్ సూచిక బోర్డ్‌ను ఎక్స్‌లో ఓ యూజర్ పోస్ట్ చేయగా మిశ్రమ స్పందన వ్యక్తమైంది.
ఓ యూజర్ తన అనుభవాన్ని పేర్కొంటూ.. ‘రాజకీయాల గురించి చర్చ పక్కదారి పడుతుంది. వచ్చినవాళ్లు కేవలం కాఫీ ఆర్డర్ చేసి గంటల కొద్దీ రాజకీయాలు, రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడతారు. ఇది హోటల్ వాళ్ల వ్యాపారంపై ప్రభావం చూపుతుంది’ అని అన్నారు.
ఇలాంటి సూచిక బోర్డులు బెంగళూరులో సాధారణమేనని కొందరు కామెంట్ చేశారు. కొందరు యూజర్లు హోటల్ వాళ్ల నిబంధనను సమర్థించగా, కొందరు అంగీకరించ లేకపోయారు. ‘మనం ఏం చర్చించుకుంటున్నామో వాళ్లకెలా తెలుస్తుంది?’ అని ఓ యూజర్ సందేహం వ్యక్తం చేశారు!