IndiGo | దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో (IndiGo) సంక్షోభం కొనసాగుతోంది. వరుసగా ఏడోరోజైన సోమవారం కూడా ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ముంబై సహా దేశ వ్యాప్తంగా 400కిపైగా విమానాలు రద్దయ్యాయి. దీంతో వేలాది మంది ప్రయాణికులకు అవస్థలు తప్పలేదు. ఇక ఈ సంక్షోభం వేళ ఇండిగో షేర్లు భారీగా పడిపోయాయి (IndiGo share price crashes).
ఇండిగో మాతృసంస్థ అయిన ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ (InterGlobe Aviation) షేర్ ధర నేడు పడిపోయింది. సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలో ఏకంగా 7 శాతం పతనమైంది. ఆ తర్వాత కొద్దిగా కోలుకొంది. ఉదయం 10 గంటల సమయంలో షేర్లు రూ.5,160 వద్ద, 3.92 శాతం (రూ.210.50) నష్టంతో ట్రేడవుతున్నాయి. ఇక గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో ఈ షేర్ల విలువ 9 శాతానికి పైగా విలువ కోల్పోయిన విషయం తెలిసిందే.
ప్రయాణికులకు రూ.610 కోట్లు తిరిగిచ్చిన ఇండిగో
రోజుకు సుమారు 2,300 విమానాలు ఇండిగో ఎయిర్‌లైన్స్ నడుపుతున్నది. దీంతో దేశీయ విమానయాన మార్కెట్లో దాదాపు 65 శాతం ఆ సంస్థ ఆధీనంలో ఉన్నది. ఈ నేపథ్యంలో విమాన ప్రయాణికులు ఇండిగోపైనే ఎక్కువగా ఆధారపడ్డారు. అయితే ప్రభుత్వ మార్గదర్శకాల నేపథ్యంలో పైలట్ల కొరత ఎదురైంది. దీంతో డిసెంబర్ 2 నుంచి రోజుకు వేల సంఖ్యలో విమాన సర్వీసులను ఇండిగో రద్దు చేసింది. ఈ నేపథ్యంలో లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ దర్యాప్తునకు ఆదేశించింది.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలతో ఇండిగో ఎయిర్‌లైన్స్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. విమాన సర్వీసుల పునరుద్ధరణను వేగవంతం చేసింది. శనివారం 1,500, ఆదివారం 1,650 విమానాలు నడిపింది. 138 గమ్యస్థానాలలో 135కి కనెక్టివిటీని పునరుద్ధరించింది. అలాగే ప్రయాణికులకు రూ.610 కోట్ల భారీ మొత్తాన్ని తిరిగి చెల్లించింది. ప్రభావిత ప్రయాణికులకు సుమారు 3,000 సామగ్రిని ఇండిగో తిరిగి ఇచ్చినట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది.
Also Read..
Air India | కేంద్రం మార్గదర్శకాలు.. టికెట్ ధరలపై పరిమితి విధించిన ఎయిర్ ఇండియా
IndiGo | ఏడో రోజూ ఇండిగో సంక్షోభం.. నేడు వందలాది విమానాలు రద్దు
Goa Night Club | గోవా నైట్‌క్లబ్‌లో భారీ అగ్నిప్రమాదం.. వెలుగులోకి సంచలన వీడియో