Mukesh Ambani | ఆసియాలోనే అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) 2025 ఆర్థిక సంవత్సరంలోనూ జీతం తీసుకోలేదు (Zero salary). తాజాగా సంస్థ విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఇలా ముకేశ్ అంబానీ జీతం తీసుకోకపోవడం వరుసగా ఇది ఐదో ఏడాది (5th straight year) కావడం విశేషం.
కరోనా, ఆర్థిక రంగం ఢీలా పడటంతో 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి ముకేశ్ అంబానీ జీతం తీసుకోకుండా పనిచేస్తున్న విషయం తెలిసిందే. అయితే అంతకుముందు మాత్రం 2008-09 నుంచి 2019-20 వరకు ఏటా రూ.15 కోట్లు తీసుకుంటూ వచ్చారు. కానీ కరోనా నేపథ్యంలో 2020-21 నుంచి జీతాన్ని తీసుకోబోనని ప్రకటించారు. ఈ క్రమంలో ఇప్పటికీ అదే నిర్ణయానికి కట్టుబడి వరుసగా ఐదో ఏడాది కూడా జీతం తీసుకోలేదు. ఇక ముకేశ్ అంబానీ 103.3 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే 18వ కుబేరుడిగా కొనసాగుతున్నారు.
మరోవైపు ముకేశ్ అంబానీ ముగ్గురు పిల్లలు ఇషా అంబానీ పిరమల్, ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీలు 2023 అక్టోబర్‌లో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా బోర్టులో చేరిన విషయం తెలిసిందే. వారు కూడా జీతాలు తీసుకోవడం లేదు. బోర్డు సమావేశాలకు హాజరైనప్పుడు ఫీజులు మాత్రం చెల్లిస్తారు. అలాగే సంస్థ లాభాలపై కమీషన్‌నూ తీసుకుంటారు. వారు 2025 ఆర్థిక సంవత్సరానికి గానూ ఒక్కొక్కరు సిట్టింగ్ ఫీజుగా రూ.6 లక్షలు, కమీషన్‌గా రూ.2.25 కోట్లు అందుకున్నారు. అంతకు ముందు ఏడాది 2024 ఆర్థిక సంవత్సరంలో వారు ఒక్కొక్కరు రూ.కోటి కమీషన్ పొందారు.
ఇక ముకేశ్ అంబానీ బంధువులైన నిఖిల్, హితల్ మేస్వానీ 2025 ఆర్థిక సంవత్సరంలో ఒక్కొక్కరు రూ.25 కోట్లు అందుకున్నారు. అందులో రూ.7.28 కోట్లు జీతం, ప్రోత్సాహకాలు కాగా, రూ.44 లక్షలు రిటైరల్ బెనిఫిట్స్, రూ.17.28 కోట్లు కమీషన్‌గా అందుకున్నారు. ఇక ఆగస్టు 2023లో బోర్డు నుంచి వైదొలిగిన నీతా అంబానీకి సంబంధించిన వివరాలు 2025 ఆర్థిక సంవత్సరంలో కనిపించలేదు. అంతకు ముందు ఏడాది నీతా సిట్టింగ్ ఫీజుగా రూ.2 లక్షలు, రూ.97 లక్షలు కమీషన్‌గా అందుకున్నారు. ఇక 2022-23కుగాను నీతా అంబానీ రూ.6 లక్షల ఫీజు, రూ.2 కోట్ల కమీషన్‌గా పొందారు.
Also Read..
TCS | ఉద్యోగులకు టీసీఎస్ తీపి కబురు.. 80 శాతం ఉద్యోగుల వేతనాలు పెంపు