న్యూఢిల్లీ, ఆగస్టు 6 : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం అన్నంత పనీ చేశారు. రష్యాతో వాణిజ్యాన్ని తగ్గించుకోకపోతే 24 గంటల్లో మరిన్ని సుంకాలుంటాయని హెచ్చరించినట్టుగానే 25 శాతం అదనపు సుంకాలను విధించారు. దీంతో భారతీయ వ్యాపార, పారిశ్రామిక వర్గాల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్నది. అమెరికా నుంచీ ఇదే స్పందన వస్తుండటం గమనార్హం.
ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు ప్రమాదంలో పడేలా ఉన్నాయి. ఇరు దేశాల ప్రతినిధులు పరిస్థితి చేజారిపోకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ 25 శాతం అదనపు సుంకాలతో అమెరికాకు భారత్ నుంచి వచ్చే చాలా వస్తూత్పత్తులు ప్రభావితం అవుతాయి.
ట్రంప్ టారిఫ్‌లు అమెరికాకు భారత్ నుంచి జరిగే ఎగుమతుల్లో 40-50 శాతాన్ని ప్రభావితం చేయవచ్చు. సుంకాలతో మార్కెట్లో భారతీయ వస్తూత్పత్తుల ధరలు పెరిగిపోతాయి. అంతిమంగా ఆయా దిగుమతులు పడిపోయే ప్రమాదం ఉన్నది. తాజాగా విధించిన 25 శాతం అదనపు సుంకాలతో అమెరికా వాణిజ్య భాగస్వాముల్లో భారత్‌పైనే అధిక సుంకాలు పడుతున్నట్టవుతున్నది.
ట్రంప్ తాజాగా ప్రకటించిన అదనపు సుంకాలు దిగ్భ్రాంతికరం. ఈ నిర్ణయం ప్రభావం ఆ దేశానికి వెళ్లే 55 శాతం భారతీయ ఎగుమతులపై ఉంటుంది. టెక్స్టైల్స్, మెరైన్, తోలు ఉత్పత్తులు, రత్నాలు-ఆభరణాల ఎగుమతులకు దెబ్బే.
దేశంలో ద్రవ్యోల్బణంపై అమెరికా టారిఫ్‌ల ప్రభావం పెద్దగా ఉండబోదు. ద్రవ్యోల్బణంలో 50 శాతం వాటా ఆహారోత్పత్తులదే. అంతర్జాతీయ పరిణామాలతో వీటి ధరలు పెరిగే అవకాశాల్లేవు.