Samsung | దక్షిణ కొరియాకు ఎలక్ట్రానిక్స్ దిగ్గజ సంస్థ శామ్ సంగ్‌కు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. కంపెనీతో పాటు అధికారులకు 601 మిలియన్ డాలర్ల పన్నులతో పాటు జరిమానా విధించింది. ఇది భారతీయ కరెన్సీలో సుమారు రూ.5,154 కోట్లు. టెలికాం పరికరాలకు సంబంధించిన దిగుమతి సుంకాన్ని తప్పించుకునేందుకు అవకతవకలకు పాల్పడిందన్న కారణంతో కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతేడాది భారత్‌లో కంపెనీ సుమారు రూ.8,183 కోట్ల నికర లాభాన్ని ఆర్జించగా.. భారీ పన్ను, జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకున్నది. అయితే, శామ్ సంగ్ టాక్స్ ట్రిబ్యునల్ లేదంటే కోర్టులో సవాల్ చేసే అవకాశం ఉన్నది. శామ్ సంగ్ కంపెనీ నెట్వర్క్ విభాగం ‘రిమోట్ రేడియో హెడ్’ అనే డివైజ్‌తో పాటు పలు టెలికాం పరికరాలను దిగుమతి చేస్తున్నది.
ఈ డివైజ్ 4జీ కమ్యూనికేషన్ వ్యవస్థలో మొబైల్ టవర్‌కు కీలకం. ఈ పరికరాలకు 10 నుంచి 20శాతం వరకు సుంకాలు విధించే అవకాశం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. కానీ, దిగుమతి సుంకాలను తప్పించుకునేందుకు శామ్ సంగ్ ఆయా పరికరాలను తప్పుగా వర్గీకరించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. 2018 నుంచి 2021 మధ్య దక్షిణ కొరియా, వియత్నాం నుంచి 784 మిలియన్ డాలర్ల (రూ.6,717కోట్లు) విలువైన పరికరాలు దిగుమతి చేసుకున్నా.. ఎలాటి పన్ను చెల్లించలేదని సంబంధిత వర్గాలు చెప్పాయి. కస్టమ్ సుంకాలను తప్పించుకునేందుకు శామ్ సంగ్ ఉద్దేశపూర్వకంగా తప్పుడు పత్రాలను సమర్పించిందని ప్రభుత్వ విచారణలో తేలింది. సదరు కంపెనీ వ్యాపార నీతి, పరిశ్రమ ప్రమాణాలను ఉల్లంఘించిందని కస్టమ్స్ కమిషనర్ సోనాల్ బజాజ్ పేర్కొన్నారు.
లాభాలను పెంచుకునే ఉద్దేశంతో మాత్రమే శామ్ సంగ్ అవకతవకలకు పాల్పడిందని కస్టమ్స్ అధికారులు పేర్కొంటున్నారు. 2021లో కస్టమ్స్ అధికారులు ముంబయి, గురుగ్రామ్‌లోని శామ్ సంగ్ కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో పలు పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత కంపెనీకి చెందిన సీనియర్ అధికారులను కస్టమ్స్ విచారించింది. ఆర్ఆర్హెచ్ ట్రాన్సీవర్ కేటగిరిలో ఉందని.. అది కూడా సుంకాలకు లోబడి ఉందని ప్రభుత్వం పేర్కొంది. అయితే, కంపెనీ మాత్రం వ్యతిరేకించింది. ఆర్ఆర్హెచ్ ట్రానీవర్గా పని చేయదని, దాంతో టారిఫ్ మినహాయింపులకు అర్హత, దిగుమతి సుంకాలు విధించరాదని కంపెనీ వాదిస్తున్నది. ఈ క్రమంలోనే కంపెనీకి కేంద్రం ఏడుగురు శామ్ సంగ్ ఎగ్జిక్యూటివ్‌లకు రూ.694 కోట్ల వ్యక్తిగత జరిమానా, మరో రూ.4460కోట్లు కంపెనీకి పన్ను విధించింది.
Stock Market | వరుస లాభాలకు బ్రేక్.. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
Tariffs Hike | యూజర్లకు షాక్ ఇవ్వబోతున్న టెలికాం కంపెనీలు.. త్వరలోనే పెరగనున్న రీచార్జ్ ధరలు..!
EPFO | యూపీఐ ద్వారా పీఎఫ్ విత్‌డ్రా.. జూన్ నుంచి అమలులోకి!