Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. ఇటీవల వరుసగా ఏడు సెషన్లలో లాభాల్లో కొనసాగిన మార్కెట్లు గురువారం భారీగా పతనమయ్యాయి. యూఎస్ టారిఫ్ విధానాల్లో స్పష్టత లేకపోవడం.. చమురు ధరల పెరుగుదల.. ఇటీవల మార్కెట్లో ర్యాలీ కొనసాగుతుండడంతో మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్లు ఒక్కసారిగా కుదేలయ్యాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ ఉదయం ఫ్లాట్‌గా మొదలైంది. ఆ తర్వాత కొద్దిసేపటికి సెన్సెక్స్ 78,167.87 గరిష్ఠానికి చేరుకుంది. ప్రారంభంలోనే 150.68 పాయింట్లు లాభపడింది. ఆ తర్వాత సెన్సెక్స్ అమ్మకాలతో ఒత్తిడికి గురైంది. దాంతో ఒక దశలో 822.97 పాయింట్లు పతనమైంది. ఇంట్రాడేలో 78,167.87 పాయింట్ల గరిష్ఠానికి చేరిన సెస్సెక్స్.. 77,194.22 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది. చివరకు 728.69 పాయింట్లు తగ్గి.. 77,288.50 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 181.80 పాయింట్లు పతనమై.. 23,486.85కి చేరింది. నిఫ్టీలో ఇండస్ఇండ్ బ్యాంక్, ట్రెంట్, హెచ్‌సీఎల్ టెక్, హీరో మోటోకార్ప్, భారతీ ఎయిర్టెల్, గ్రాసిమ్, ఎంఅండ్ఎం, టైటాన్ కంపెనీ, బ్రిటానియా లాభపడ్డాయి. ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, సిప్లా, బజాజ్ ఫైనాన్స్, బీపీసీఎల్, యాక్సిస్ బ్యాంక్, అపోలో హాస్పిటల్, ఇన్ఫోసిస్, విప్రో నష్టపోయాయి.
యూఎస్ వాణిజ్య విధానంపై అనిశ్చిత మధ్య పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల కొన్ని దేశాలకు టారిఫ్ నుంచి మినహాయింపులు ఉంటాయని ప్రకటించారు. అయితే, ఈ విషయంలో స్పష్టత కొరవడింది. ఈ అస్పష్టత కారణంగా భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లను అస్థిరపరించింది. గతవారంలో దలాల్ స్ట్రీల్లో ర్యాలీ కొనసాగింది. ఈ క్రమంలో గురువారం పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్ ఒత్తిడికి గురైంది. ఫలితంగా సూచీలు పతనమయ్యాయి. మరో వైపు డాలర్ మారకంతో పోలిస్తే రూపాయి 6 పైసలు తగ్గి 85.78కి చేరింది. దీనికి తోడు వెనిజులా నుంచి చమురు, గ్యాస్ దిగుమతి చేసుకునే దేశాలపై సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో చమురు ధరలు బుధవారం భారీగా పెరిగాయి. భారత్ ముడి చమురును దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే. ముడి చమురు ధరలు పెరిగే అవకాశం ఉండడంతో భారత స్టాక్స్‌పై ప్రత్యక్షంగా ప్రభావం పడే అవకాశం ఉన్నది.