GST Relief | ఈ ఏడాది ఆరంభంలో ఆదాయపన్నులో రాయితీలతో వేతన జీవులకు కొంత ఊరట కల్పించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. నిత్యావసర వస్తువులపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) భారాన్ని తగ్గించాలని (GST Relief) యోచిస్తున్నట్లు తెలిసింది. మధ్యతరగతి (Middle Class), తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలు ఎక్కువగా వినియోగించే వస్తువులపై ప్రస్తుతం 12 శాతంగా ఉన్న జీఎస్టీ శ్లాబును పూర్తిగా తొలగించడం లేదా ఈ శ్లాబులోని పలు వస్తువులను 5 శాతం శ్లాబులోకి మార్చడం వంటి ప్రతిపాదనలను కేంద్రం పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి.
టూత్‌పేస్ట్, టూత్ పౌడర్, గొడుగులు, కుట్టు మిషన్లు, ప్రెజర్ కుక్కర్లు, వంట పాత్రలు, గీజర్లు, తక్కువ సామర్థ్యం కలిగిన వాషింగ్ మెషీన్లు, ఎలక్ట్రిక్ ఐరన్ బాక్స్‌లు, సైకిళ్లు, రూ.1,000 కంటే ఎక్కువ ధర ఉన్న రెడీమేడ్ దుస్తులు, రూ.500 నుంచి రూ.1,000 మధ్య గల చెప్పులు, స్టేషనరీ వస్తువులు, వ్యాక్సిన్లు, సిరామిక్ టైల్స్, వ్యవసాయ ఉపకరణాలు వంటివి జీఎస్టీ తగ్గింపు జాబితాలో ఉన్నట్లు సదరు వర్గాలు తెలిపాయి. ఈ నిర్ణయం అమలైతే ప్రతిపాదిత జాబితాలోని వస్తువులు తక్కువ ధరకే అందుబాటులోకి రానున్నాయి. ఈ కారణంగా పేద, మధ్య తరగతి కుటుంబాలపై కొంత భారం తగ్గనుంది.
ఈ మార్పుల వల్ల ప్రభుత్వ ఖజానాపై సుమారు రూ. 40,000 కోట్ల నుంచి రూ. 50,000 కోట్ల భారం పడొచ్చని అంచనా. అయినప్పటికీ, ధరలు తగ్గితే వినియోగం పెరిగి, దీర్ఘకాలంలో పన్ను వసూళ్లు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. జీఎస్టీ రేట్లను హేతుబద్ధీకరిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఇటీవలే పరోక్షంగా సంకేతాలిచ్చిన విషయం తెలిసిందే. రాబోయే 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల చివర్లో జీఎస్టీ సమావేశం జరగొచ్చని సదరు వర్గాలు సూచిస్తున్నాయి.
Also Read..
Himachal Pradesh | భారీ వర్షాలకు హిమాచల్ అతలాకుతలం.. 51 మంది మృతి
Delhi CM | 5 టీవీలు, 14 ఏసీలు.. ఢిల్లీ సీఎం నివాసానికి రూ.60 లక్షలతో పునరుద్ధరణ పనులు
Sudden deaths | ఆకస్మిక మరణాలకు కొవిడ్ వ్యాక్సిన్లు కారణం కాదు : కేంద్రం