న్యూఢిల్లీ: అమెరికా, ఇరాన్ మధ్య గత కొంతకాలంగా రగులుతున్న ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఇజ్రాయెల్‌తో చేతులు కలిపిన అమెరికా సైన్యం శనివారం ఇరాన్‌పై బాంబుల వర్షం కురిపించగా ఇందుకు ప్రతీకారంగా ఖతార్, బహ్రెయిన్, యూఏఈలోని అమెరికన్ సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు నిర్వహించింది. దీంతో ఈ ఘర్షణలు యావత్ పశ్చిమాసియాకు విస్తరించే ప్రమాదం కనపడుతున్నది.
కాగా, తాజా ఘర్షణలతో ప్రపంచ చమురు సరఫరాలకు, భారత్ చమురు దిగుమతులకు కీలకమైన హొర్ముజ్ జలసంధిపై తీవ్ర ఆందోళన నెలకొంది. 161 కిలోమీటర్ల పొడవు, 33 కిలోమీటర్ల వెడల్పు ఉండే హొర్ముజ్ జలసంధి ఇరాన్‌కు దక్షిణాన ఉంది. పర్షియల్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్‌లను కలిపే ఓ కీలకమైన సముద్ర మార్గమైన దీని ద్వారా ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20 శాతం రవాణా జరుగుతున్నది. ఇరాన్, ఒమన్ సరిహద్దులో ఉన్న ఈ ఇరుకైన మార్గం మూసివేత ప్రపంచ చమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపగలదు.
ఈ జలసంధిపై మరోసారి తన ఆధిపత్యాన్ని ప్రకటించిన ఇరాన్ దీన్ని మూసివేస్తామని తాజాగా హెచ్చరించింది. గతంలో కూడా అనేక సందర్భాల్లో ఈ జలసంధిని అడ్డుకునే సామర్థ్యం తమకు ఉందని ఇస్లామిక్ దేశం ప్రకటించింది. అయితే గడచిన 40 ఏండ్లలో ఎన్నడూ అటువంటి దుస్సాహసానికి ఇరాన్ పూనుకోలేదు. కాని 10 రోజుల క్రితం అణు కార్యక్రమంపై అమెరికాతో చర్చలు కొనసాగుతున్న తరుణంలో ఫిబ్రవరి 17న జలసంధిని తాత్కాలికంగా మూసివేయాలని ఇరాన్ నిర్ణయించింది.
ఒకవేళ హొర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేసిన పక్షంలో భారత్‌కు సరఫరా అయ్యే మొత్తం చమురు దిగుమతుల్లో 50 శాతానికి పైగా నిలిచిపోయే అవకాశం ఉంది. ఈ మార్గం ద్వారా భారత్‌కు జరుగుతున్న చమురు సరఫరా ప్రతినెలా పెరుగుతూ పోతున్నది. ఈ ఏడాది ఫిబ్రవరి 24 వరకు ప్రతి రోజు 26 లక్షల బ్యారెళ్ల చమరును గల్ఫ్ దేశాల నుంచి భారత్ దిగుమతి చేసుకుంది. ప్రధానంగా ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్ నుంచి ఈ జలసంధి ద్వారా ప్రతిరోజు సుమారు 26 లక్షల బ్యారెళ్ల చమురు దిగుమతులు భారత్‌కు జరుగుతున్నట్లు కమోడిటీ ట్రాకింగ్ సంస్థ కెప్లెర్కు చెందిన పరిశోధనా విశ్లేషకుడు సుమిత్ రితోలియా పేర్కొన్నట్లు మనీ కంట్రోల్ వెల్లడించింది.
ఈ జలసంధిని ఒకరోజు అడ్డగిస్తే బ్రెంట్(బెంచ్‌మార్కు) ముడి చమురు ధరలు 120 డాలర్ల నుంచి 150 డాలర్ల మధ్య చేరుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఫిబ్రవరి 20 నాటికి బ్యారెల్ ముడిచమురు ధర 66 డాలర్లుగా ఉంది. ఘర్షణలు మరింత విస్తృతమై చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడిన పక్షంలో భారత్ ప్రత్యామ్నాయ మార్గాలైన సౌదీ అరేబియాకు చెందిన వెస్ట్ పైప్లైన్ల నుంచి ఎర్ర సముద్రానికి, యూఏఈకి చెందిన అబు దాబి క్రూడ్ ఆయిల్ పైప్‌లైన్(ఉజైరా) ద్వారా చమురును దిగుమతి చేసుకోవచ్చు. అయితే ఈ పైప్లైన్ల సామర్థ్యం పరిమితమని,మనీ కంట్రోల్ పేర్కొన్నది.