బుధవారం 12 ఆగస్టు 2020
Business - Jul 29, 2020 , 03:28:49

బయో ఏషియా ఫౌండర్‌ బీఎస్‌ బజాజ్‌ కన్నుమూత

బయో ఏషియా ఫౌండర్‌ బీఎస్‌ బజాజ్‌ కన్నుమూత

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: బయో ఏషియా వ్యవస్థాపకుడు డాక్టర్‌ బీఎస్‌ బజాజ్‌ కన్నుమూశారు. ఆయన వయస్సు 93 ఏండ్లు. మంగళవారం ఉదయం 6.30 గంటలకు హైదరాబాద్‌లోని సోమాజిగూడలో ఉన్న స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.  ఏటా హైదరాబాద్‌లో జరుగుతున్న బయో ఏషియా సదస్సుకు ఈయనే రూపకర్త. ప్రపంచంలో బయోఫార్మాకు సంబంధించిన కంపెనీలను ఒక్కతాటిపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో బజాజ్‌  విశేషంగా కృషి చేశారు. గడిచిన రెండు దశాబ్దాలకాలంలో బయోటెక్నాలజీ రంగంలోకి మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు రావడంలో కీలక పాత్ర పోషించారు.   

బజాజ్‌ సేవలు చిరస్మరణీయం: కేటీఆర్‌

బయోటెక్నాలజీ రంగంలో విశేష సేవలందించిన డాక్టర్‌ బీఎస్‌ బజాజ్‌ మృతి పట్ల రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బయో ఏషియా ప్రారంభకులని, హైదరాబాద్‌లో బయోటెక్నాలజీ రంగానికి సానుకూల వాతావరణం ఏర్పాటు కావడానికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు. 

సీఎం కేసీఆర్‌ సంతాపం 

హైదరాబాద్‌లో బయోటెక్నాలజీ పరిశ్రమ వృద్ధి చెందడంలో విశేష కృషి చేసిన డాక్టర్‌ బీఎస్‌ బజాజ్‌ మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దేశీయ బయో టెక్నాలజీ రంగానికి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఫెడరేషన్‌ ఆఫ్‌ ఏషియన్‌ బయోటెక్‌ వ్యవస్థాపక సెక్రటరీగా వ్యవహరించారని, జినోమ్‌ వ్యాలీ ఏర్పాటు, బయో ఏషియా సదస్సు కార్యారూపం దాల్చడంలో ఆయన ఎంతో కృషి చేశారన్నారు. 2019 బయో ఏషియా సదస్సులో ఆయనను లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ అవార్డుతో సత్కరించారు.


logo