Home Loanసొంతింటి కల నెరవేరడం అనుకున్నంత తేలికేం కాదు! కోరుకున్న ఇంటి ధర అనుకున్న రేంజ్లో ఉండదు. తక్కువ బడ్జెట్ ఇల్లు కోరుకున్నట్టు ఉండదు! మార్కెట్ ధర కన్నా తక్కువ బడ్జెట్లో అందమైన ఇల్లు సొంతం చేసుకునే అవకాశం కోసం అందరూ ఎదురుచూస్తుంటారు. అలాంటి వారికి ఆశాదీపం వేలం పాట! బ్యాంకర్లు నిర్వహించే ఆస్తుల వేలం కొందరికి కలల సౌధాన్ని సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తుంది. అయితే, బ్యాంకు వేలం వేసే ఇండ్లను, ఇతర ఆస్తులను కొనుగోలు చేస్తే అదనపు లబ్ధి ఏమైనా కలుగుతుందా?
బ్యాంకు వేలం వేసే ఇండ్లు బహిరంగ మార్కెట్ ధర కంటే.. సుమారు 20 శాతం వరకు తక్కువగానే ఉంటాయి! బయటికన్నా తక్కువ ధర పలుకుతుండటంతో వాటిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని చాలామంది ప్రయత్నిస్తుంటారు. ఇలా తక్కువ ధర పలకడానికి అనేక కారణాలు ఉంటాయి. ఏ బ్యాంక్ అయినా ఇంటి విలువలో 80 శాతం వరకు (రూ.30 లక్షల కన్నా ఎక్కువ ఉంటే) మాత్రమే రుణం మంజూరు చేస్తుంది. దీనికితోడు సదరు ఇంటి యజమాని ఒకట్రెండు ఏండ్లు గృహరుణం వాయిదాలు చెల్లించడంతో రుణం మొత్తం కొంత తగ్గుతుంది. ఈ నేపథ్యంలో వేలం వేసే ఇండ్ల ధరలు మార్కెట్ ధర కన్నా తక్కువగా ఉంటాయి. దీంతో పోటీ ఎక్కువగానే ఉంటుంది. ఈ-బిడ్డింగ్‌లో ఎవరు ఎక్కువ కోట్ చేస్తే ఇల్లు వాళ్లకు సొంతం అవుతుంది.
తక్కువ ధరకు మంచి ఇల్లు పొందడం కన్నా ఆనందం ఏముంటుంది? కానీ, వేలంలో కొన్నవాటికి అన్ని బ్యాంకులూ రుణం మంజూరు చేయకపోవచ్చు. దీంతో ఏదైనా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ)లో అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. బ్యాంకులతో పోలిస్తే ఎన్బీఎఫ్సీల్లో వడ్డీ రేటు అధికంగా ఉంటుంది. ఇంటి ధర తక్కువ పలికినా.. వడ్డీ అధికంగా ఉండటంతో, చెల్లించే మొత్తంలో మార్పు ఉండకపోవచ్చు! దానివల్ల తక్కువ ధరకు మంచి ఆస్తి దక్కిందన్న సంతృప్తి ఆవిరైపోతుంది. వేలం పాటలో కొన్న ఇంటికి బ్యాంకర్ సేల్ డీడ్ ఇవ్వరు. సేల్ సర్టిఫికెట్ మాత్రమే ఉంటుంది. భవిష్యత్తులో పిల్లల చదువుల కోసమో, పెండ్లి కోసమో ఇంటి మీద రుణం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే.. నిరాశ ఎదురుకావచ్చు. అందుకే, ఒకే ఒక ప్రాపర్టీ కొనేవాళ్లు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని వేలం ఇండ్లను కొనకపోవడమే మంచిదని చెబుతారు నిపుణులు. ఒకటికి మించి ఆస్తులు ఉన్నవాళ్లు వేలంలో ఇంటిని కొన్నప్పటికీ ఇబ్బందేం ఉండదని పేర్కొంటారు.
Home Loan
అంతకన్నా ముందు, ఆస్తికి సంబంధించి న్యాయపరమైన చిక్కులు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకోవాలి. బ్యాంకువాళ్లు అమ్ముతున్నారు కాబట్టి లీగల్ సమస్యలు ఉండవని గుడ్డిగా నమ్మడానికి వీల్లేదు! ప్రాపర్టీ వివరాలు న్యాయ నిపుణుడికి చూపించి ఏ చిక్కులూ లేవని నిర్ధారించుకున్న తర్వాతే వేలంలో పాల్గొనాలి. ఇంటి విషయంలో కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. సదరు ఆస్తి యజమాని వాయిదాలు చెల్లించకపోవడానికి కారణాలు ఏంటో తెలుసుకోవడం మంచిదే! ఆ వ్యక్తి ఆర్థికంగా చితికిపోయాడా, మరేమైనా సమస్యలు ఎదుర్కొన్నాడా అన్నది తెలుసుకుంటే వేలంలో పాల్గొనవచ్చో లేదో.. ఓ అంచనాకు రావచ్చు. నమ్మకాల సంగతి అటుంచితే, మార్కెట్ ధర కన్నా తక్కువలో ఇల్లు వస్తుంటే కాదనుకోవడం సరైనది కాదు! కానీ, కొనదలచిన ఇల్లు నచ్చినప్పుడే వేలంలో పాల్గొనాలి! అంతేకానీ, తక్కువలో వస్తుందని నచ్చని ఇంటిపై ఇన్వెస్ట్ చేసి, జీవితకాలం రుణ వాయిదాలు చెల్లిస్తూ పోవడం మానసిక అశాంతికి దారితీస్తుంది. అనవసరంగా కొత్త కొత్త బరువు నెత్తిన వేసుకున్నట్టు అవుతుంది.
ఇంటి యజమాని మూడు నెలలు వాయిదా చెల్లించకపోతే, బ్యాంకువాళ్లు నోటీసులు పంపుతారు. దానికి కూడా స్పందించకపోతే సుమారు మూడు నెలలు గడువు ఇచ్చి.. ‘ప్రాపర్టీని వేలం వేస్తామ’ని నోటీసులు పంపుతారు. అప్పటికీ స్పందన కరువైతే.. న్యాయబద్ధంగా చర్యలు తీసుకొని వేలంలో ఉంచుతారు. ఆ ఇంటిపై అప్పటివరకు ఉన్న రుణం మొత్తాన్నీ వెలగా నిర్ణయిస్తారు! వేలం నిర్వహణ మొత్తం ఆన్లైన్లోనే జరుగుతుంది. వేలంలో పాల్గొనదలచిన వాళ్లు ముందుగా ఐదు శాతం రుసుం చెల్లించాల్సి ఉంటుంది. వేలంలో ఎక్కువ బిడ్ చేసిన వారికే ప్రాపర్టీ దక్కుతుంది. ఇంటిని సొంతం చేసుకున్న వాళ్లు బ్యాంకు నిర్దేశించిన సమయం లోగా 20 శాతం చెల్లించాలి. తర్వాత 40 రోజుల్లోగా మిగతా మొత్తం చెల్లిస్తే ఆస్తి వారి సొంతం అవుతుంది.
– ఎం. రాం ప్రసాద్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్
ram@rpwealth.in, www.rpwealth.in
Reverse Mortgage Scheme | మీ ఇంటిని అద్దెకు ఇవ్వకుండానే ఇలా నెలనెలా వేలకు వేలు పొందండి
“Home Loan on Whatsapp | హోంలోన్ కావాలా.. వాట్సాప్‌లోనే అప్లయ్ చేసుకొండిలా..!”
personal finance | నెలకు రూ.15వేలు ఇన్వెస్ట్ చేస్తే కోటి రూపాయలు సంపాదించవచ్చు
CIBIL Score | సిబిల్ స్కోర్ ఒక్కటి ఉంటే లోన్ వచ్చేస్తుందని అనుకుంటే పొరపాటే..