Reverse Mortgage Scheme | మీ ఇంటిని అద్దెకు ఇవ్వకుండానే ఇలా నెలనెలా వేలకు వేలు పొందండి
Reverse Mortgage Scheme | ఇష్టంగా కట్టుకున్న ఇంటి కోసం మధ్యతరగతి మనిషి పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. కడుపు కట్టుకొని వాయిదాలు చెల్లిస్తూ ఇంటిని సొంతం చేసుకుంటాడు. కానీ, అదే ఇల్లు రిటైర్ అయ్యాక ఎవరికీ అద్దెకు ఇవ్వకుండానే మీకు ఆదాయాన్ని తెచ్చిపెడుతుందంటే నమ్ముతారా? కానీ, ఇది నిజం.
Reverse Mortgage Scheme | ఇష్టంగా కట్టుకున్న ఇంటి కోసం మధ్యతరగతి మనిషి పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. కడుపు కట్టుకొని వాయిదాలు చెల్లిస్తూ ఇంటిని సొంతం చేసుకుంటాడు. కానీ, అదే ఇల్లు రిటైర్ అయ్యాక ఎవరికీ అద్దెకు ఇవ్వకుండానే మీకు ఆదాయాన్ని తెచ్చిపెడుతుందంటే నమ్ముతారా? కానీ, ఇది నిజం. కాస్త సెంటిమెంట్లను పక్కన పెడితే.. కలల నెలవు పదికాలాలపాటు ఆర్థికంగా అండగా నిలబడుతుంది. రివర్స్ మార్ట్గేజ్ ద్వారా ప్రతినెలా పింఛన్లా టంచన్‌గా నగదు మీ ఖాతాలో జమవుతుంది.
మధ్యతరగతి వ్యక్తి జీవితం సింహభాగం సుడిగుండాల మధ్యే తిరుగుతూ ఉంటుంది. పిల్లల చదువులు, పెండ్లిళ్లు ఇవన్నీ పూర్తయ్యేసరికి పదవీ విరమణ వయసు దగ్గర పడుతుంది. రెక్కలు వచ్చి పిల్లలు ఎగిరిపోయాక.. ముదిమి దంపతులు తలదాచుకోవడానికి ఇల్లు మాత్రమే మిగులుతుంది. అప్పనంగా వచ్చిన ఆస్తి కాదది. బ్యాంకు అప్పుతో కొనుక్కున్న ఇల్లు. నెలనెలా కిస్తీలు కట్టి సొంతం చేసుకున్న గూడు. బాధ్యతలన్నీ తీరాక హాయిగా కాలం గడపాలనుకుంటే.. అందుకు తగ్గ ఆదాయం ఉండాలి కదా! పెద్దబ్బాయి ఇంజినీరింగ్ సీటు కోసం పీఎఫ్ డబ్బులు కాస్తా ఖర్చు పెట్టేశాక, కూతురు పెండ్లికి రిటైర్మెంట్ గ్రాట్యుటీ సొమ్మంతా ఆవిరయ్యాక.. ఆ తండ్రికి చివరికి ఏం మిగులుతుంది. ‘భవిష్యత్తు ఎలా?’ అనే దిగులు తప్ప! ఇక శేషజీవితం విశేషంగా ఉంటుందని భావించడం అత్యాశే! దీనికి పరిష్కారమే రివర్స్ మార్ట్గేజ్. ఆస్తిని మళ్లీ కుదువ పెడితే.. నెలకు ఇంతని పెన్షన్ రూపంలో పొందవచ్చు.
పదిహేనేండ్లు.. ప్రతినెలా..
రివర్స్ మార్ట్గేజ్ అంటే.. మనకు పూర్తిగా సొంతమైన ఇంటిని బ్యాంకులో కుదువ పెట్టడమే! చాలా ఏండ్లుగా ఈ సదుపాయం అందుబాటులో ఉన్నా.. ఎవరూ పెద్దగా ఉపయోగించుకోవడం లేదు. ఈ ప్రక్రియలో ముందుగా బ్యాంకువాళ్లు ఇంటి మార్కెట్ విలువను అంచనావేస్తారు. అందులో అరవైశాతం ఎంతో లెక్క తేలుస్తారు. ఆ మొత్తాన్ని పది నుంచి పదిహేనేండ్ల వరకు ప్రతినెలా వాయిదాల చొప్పున ఒకటో తారీఖునే యజమాని ఖాతాలో వేస్తారు. కొన్ని సందర్భాల్లో ఇరవై ఏండ్ల వరకు కూడా చెల్లిస్తారు. ఉదాహరణకు ఇంటి మార్కెట్ విలువ కోటి రూపాయలు ఉందనుకోండి. అందులో అరవై శాతం అంటే రూ.60 లక్షలు చెల్లించడానికి ఒప్పందం చేసుకుంటారు. ఈ మొత్తాన్ని నెలకు సుమారు రూ.33,300 చొప్పున పదిహేనేండ్లు నెలనెలా చెల్లిస్తారు. ఆ ఇంటి మీద బ్యాంకువాళ్ల పెత్తనం ఏమీ ఉండదు. కుదువ పెట్టిన ఇంట్లోనే కడుపులో చల్లకదలకుండా నింపాదిగా ఉండొచ్చు. ప్రశాంతంగా కాలం గడపొచ్చు. ఈ మధ్యలో యజమాని కన్నుమూసినా, అతని భార్యకు ప్రతినెలా డబ్బు అందుతుంది.

వారసులదే బాధ్యత
ఇంటిని కుదువ పెట్టుకోవడం వల్ల బ్యాంకు వారికి వచ్చే ప్రయోజనం ఏమిటని సందేహం రావొచ్చు. వాళ్లకూ లాభం ఉంటుంది. పదిహేనేండ్ల తర్వాత వాయిదాల చెల్లింపు నిలిచిపోతుంది. తర్వాత యజమాని కన్నుమూసిన తర్వాత.. అప్పటివరకు తీసుకున్న మొత్తానికి వడ్డీ కట్టి.. రుణం ఎంత ఉందో లెక్కకడతారు. ఈ వడ్డీ గృహరుణం మిత్తి కన్నా రెండు శాతం వరకు ఎక్కువగా ఉంటుంది. యజమాని చట్టబద్ధమైన వారసులకు రుణం మొత్తం చెల్లించాల్సిందిగా తెలియజేస్తారు. వారు చెల్లించడానికి విముఖత చూపితే, ఇంటిని వేలం వేసి, రుణం మొత్తం మినహాయించుకొని మిగిలిన సొమ్మును వారి వారసులకు అందజేస్తారు. ఈ పదిహేనేండ్లలో ఇంటి విలువ పెరుగుతుంది కాబట్టి, రుణం తీరదనే బెంగ అవసరం లేదు. కష్టపడి కట్టుకున్న ఇంటిని వారసులకు ఇవ్వాలనే చాలామంది భావిస్తూ ఉంటారు. వాళ్లకు మంచి చదువు చెప్పించి, జీవితంలో స్థిరపడేలా చేయడంతో తల్లిదండ్రుల బాధ్యత ముగిసినట్టే! లెక్కకు మించిన ఆస్తులు ఉంటే ఇవ్వడంలో తప్పు లేదు! కానీ, జీవితమంతా ధారపోసి, పదవీ విరమణ తర్వాత కూడా కోరికలు చంపుకొని బతకాల్సిన పనిలేదు. కొడుకులు, బిడ్డల సంపాదన మీద ఆధారపడకుండా.. గౌరవంగా, నిశ్చింతగా జీవించడానికి ఓ ఉన్నతమైన మార్గం రివర్స్ మార్ట్గేజ్!
షరతులు వర్తిస్తాయి
☞ మార్ట్గేజ్ రుణం పొందాలంటే.. యజమాని వయసు 60 ఏండ్లు పైబడి ఉండాలి. అతని జీవిత భాగస్వామి వయసు (బతికి ఉంటే) 55 ఏండ్లు పైబడి ఉండాలి. ఇద్దరి వయసు మధ్య వ్యత్యాసం కనీసం ఐదేండ్లు ఉండాలి.
☞ రివర్స్ మార్ట్గేజ్ చేసిన ఇంట్లోనే నివాసం ఉండాలి. దానిని మరెవరికీ అద్దెకు ఇవ్వకూడదు. పదిహేనేండ్లలో ఏడాదికి మించి ఇంట్లో ఎవరూ లేనట్లయితే.. ఒప్పందం రద్దవుతుంది.
☞ కుదువ పెట్టే ఇల్లు యజమానికి సొంతమై కనీసం 20 ఏండ్లు అయి ఉండాలి.
☞ ఈ పదిహేనేండ్లు ఇంట్లో అదనపు నిర్మాణాలు, కూల్చివేతలు వంటివి చేయకూడదు. ఈ షరతులకు లోబడి ఉంటేనే బ్యాంకు అధికారులు రివర్స్ మార్ట్గేజ్ అంగీకరిస్తారు.
– ఎం. రాం ప్రసాద్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్
ram@rpwealth.in, www.rpwealth.in
Read More :
“Home Loan on Whatsapp | హోంలోన్ కావాలా.. వాట్సాప్‌లోనే అప్లయ్ చేసుకొండిలా..!”
personal finance | నెలకు రూ.15వేలు ఇన్వెస్ట్ చేస్తే కోటి రూపాయలు సంపాదించవచ్చు
CIBIL Score | సిబిల్ స్కోర్ ఒక్కటి ఉంటే లోన్ వచ్చేస్తుందని అనుకుంటే పొరపాటే..
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

