Personal Finance | ఒకప్పుడు సంపన్నుల చివరి ప్రాధాన్యంగా ఉన్న కారు.. మధ్యతరగతి బకెట్ లిస్ట్‌లో చేరింది. ఖాతాలో ఐదంకెల జీతం పడుతున్న చాలామంది ఉద్యోగులు కారు కేసి ఆశగా చూస్తున్నారు. తళతళ మెరిసే కొత్తబండి ముందునుంచి రయ్‌మని దూసుకెళ్తే చాలు.. అందులో షికారు చేస్తున్న అనుభూతికి లోనవుతారు. అయితే, కొత్త కారు కొనాలని కొందరు ఫిక్సయితే, పాత కారుతో ముచ్చట తీర్చుకుంటారు మరికొందరు. కారు ఎప్పుడు కొనాలి? ఎందుకు కొనాలి? ఏ కారు కొనాలి? ఈ విషయాలపై స్పష్టత లేకుండా బలవంతంగా వాహనయోగాన్ని తగిలించుకుంటే.. చేతి చమురు వదలడం తప్ప, ఆశించిన ప్రయోజనం ఉండదంటున్నారు నిపుణులు.
మారిన సమాజం మనిషిపై చాలా ప్రభావం చూపుతున్నది. దూరపు బంధువులెవరో కారు కొన్నారని తెలిసింది మొదలు.. అంతకన్నా పెద్ద బండి కొనేయాలని కొందరు తపిస్తుంటారు. నలుగురిలో గొప్పగా కనిపించడానికి శక్తికి మించి తాపత్రయపడుతుంటారు. ఏ ఆలోచననైనా వాయిదా వేసుకోగలరు కానీ, బుర్రలో కారు కొనాలనే పురుగు చేరితే మాత్రం అంత తేలిగ్గా దాన్నుంచి తప్పించుకోలేరు. కారు మీదికి మనసు మళ్లింది మొదలు షోరూమ్‌లకు వెళ్లడం, కొటేషన్లు తీసుకోవడం దినచర్యలో భాగమైపోతుంది. ఆన్లైన్ కారు సేలింగ్లో ధరలు వాకబు చేయడం అత్యవసర కృత్యంగా మారిపోతుంది. కొత్తదా? పాతదా? మైలేజీ ఎంత? లాంటి ప్రశ్నలు వెల్లువెత్తుతాయి. అయినవారికి, కానివారికి ఫోన్లు చేసి కార్ల పుట్టుపూర్వోత్తరాలన్నీ తెలుసుకోవడం కర్తవ్యంగా భావిస్తుంటారు. కానీ, కారు మనకు అవసరమో, లేదోనన్న విషయాన్ని మాత్రం పక్కనపెడుతుంటారు.
బ్యాంకు రుణాలు సులభంగా మంజూరు అవుతున్న ఈ రోజుల్లో కారు కొనడం పెద్దపనేం కాదు. నెలకు రూ.40వేల ఆదాయం ఉంటే చాలు.. ఆరేడు లక్షల రూపాయల కారు సాయంత్రానికి ఇంటి ముందుకు తెచ్చుకోవచ్చు. అయితే, కొత్త కారు కొనాలో, పాత కారును ఎంచుకోవాలో నిర్ణయించుకోవాల్సింది మీరే! టెక్నికల్ విషయాలు పక్కనపెడితే.. ఒకట్రెండు ఏండ్లకు తీసేసే ఉద్దేశం ఉంటే పాత కారుకు ఓటు వేయడం మంచిది. కనీసం ఐదేండ్లు నడపాలని ఫిక్సయితే కొత్త కారు కొనడం మేలు. కొందరు ముందుగా పాత కారు కొని డ్రైవింగ్‌లో నైపుణ్యం సంపాదించి, తర్వాత కొత్త కారు తీసుకోవడం తెలివైన పని అని భావిస్తుంటారు. కానీ, లోతుగా ఆలోచిస్తే ఇదేమంత గొప్ప నిర్ణయం కాదని తెలుస్తుంది. వెయ్యి రూపాయల క్లయిమ్ చార్జెస్‌తో కొత్త కారుకు ఏదైనా డ్యామేజ్ అయితే 100 శాతం మరమ్మతు చేసుకోవచ్చు. అదే ప్రమాదాలు జరిగినప్పుడు పాత కారుకు యాభై శాతానికి మించి బీమా సంస్థలు చెల్లించవు. కొత్తదైనా, పాతదైనా.. రెండు నెలల్లో కారు డ్రైవింగ్ రాకమానదు. అలాంటప్పుడు డ్రైవింగ్ కోసం పాత కారు కొనడం సరైన ఎంపిక అనిపించుకోదు.
కొత్త కారు ధర ఎక్కువ అని చాలామంది అనుకుంటారు. అందులో సగం ధరకే పాతది వస్తుంది కదా అని సెకండ్ హ్యాండ్ వైపు మొగ్గు చూపుతారు. ఉదాహరణకు రూ. పది లక్షల కొత్త కారుకు 90 శాతం వరకు రుణం మంజూరు అవుతుంది. అంటే యజమాని పది శాతం రూ.లక్ష డౌన్‌పేమెంట్ కడితే చాలు. అదే పాతకారు ధర రూ.6 లక్షలు ఉందనుకోండి. బ్యాంక్ రుణం అరవై శాతానికి మించి రాదు. అంటే డౌన్‌పేమెంట్‌గా రూ.2.40 లక్షలు చెల్లించాల్సిందే. పైగా సెకండ్ హ్యాండ్ కారు రుణంపై వడ్డీ రేట్లు ఫస్ట్హ్యాండ్తో పోలిస్తే కొంత అధికంగా ఉంటాయి. దీంతో ఈఎమ్ఐ భారం పెరుగుతుంది కూడా.
కారు కొనేముందు.. ఎన్నేండ్లు వాడుతామన్నది ముఖ్యం. రెండేండ్లకే ముచ్చట తీరిందని కొత్త కారు అమ్మకానికి పెడితే మీరు ఊహించిన ధర వచ్చే అవకాశం ఉండదు. అమ్మబోతే అడవిగా తయారవుతుంది. ఉదాహరణకు రూ.10 లక్షల కొత్త కారు రెండేండ్లు వాడి మార్కెట్లో అమ్మకానికి పెడితే గరిష్టంగా రూ.6 లక్షలకు మించి పలకదు. అదే రూ.6 లక్షల సెకండ్ హ్యాండ్ కారు రెండేండ్లు వాడుకొని అమ్మకానికి పెడితే రూ.3.5 లక్షలు పలుకొచ్చు. ఈ క్రమంలో నష్టశాతం కొత్త కారుకే ఎక్కువగా ఉంటుంది. పాత కారుకు తక్కువగా ఉంటుంది. కనీసం ఐదేండ్లు మార్చకుండా ఉంటామని ఫిక్సయితే గానీ, కొత్త కారు కొనొద్దు! కొత్తకారు, పాత కారు నిర్వహణ ఖర్చులను బేరీజు వేసుకోవడం ద్వారా స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. రెండిటి మైలేజీలో వ్యత్యాసాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అప్పుడుగానీ కొత్త కారు తీసుకోవాలో, పాత కారు తీసుకోవాలో.. ఒక నిర్ణయానికి రావాలి!
కారు కొనడం తేలికే! కానీ, అది మనకు అవసరమో, లేదో ముందుగా తెలుసుకోవాలి. రాబడి బలంగా ఉంటే పెద్దకారు కొనుక్కోవచ్చు. జీతం తప్ప వేరే ఆదాయం లేకపోతే చిన్నకారుతో సరిపెట్టుకోవచ్చు. పిల్లల ఫీజులు, గృహ అవసరాలు, కనీస అవసరాలు.. వీటన్నిటికీ సమృద్ధిగా నిధులు కేటాయించే స్థితిలో ఉంటే మీ శక్తి, ఆసక్తి మేరకు కొత్తదో, పాతదో ఏదో ఒక కారు కొనుగోలు చేయొచ్చు.
– ఎం. రాం ప్రసాద్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్
ram@rpwealth.in, www.rpwealth.in
Bank Auction Property | తక్కువలో వస్తుందని వేలంలో ఇల్లు కొంటున్నారా? ఈ నష్టాల గురించీ ఆలోచించండి
Reverse Mortgage Scheme | మీ ఇంటిని అద్దెకు ఇవ్వకుండానే ఇలా నెలనెలా వేలకు వేలు పొందండి
“Home Loan on Whatsapp | హోంలోన్ కావాలా.. వాట్సాప్‌లోనే అప్లయ్ చేసుకొండిలా..!”
“Home Loan | హోమ్ లోన్ ఎక్కడ తీసుకుంటే బెటర్? బ్యాంకుల్లోనా? ఫైనాన్సియల్ కంపెనీల్లోనా?”