Product Liability Insurance | అ.. అమ్మ. ఆ.. ఆవు. ఇవి బడి పాఠాలు. అ అంటే.. అప్పు, ఆ అంటే ఆస్తి.. ఇవి ఆర్థిక పాఠాలు. ఇష్టంగా కొనుగోలు చేసిన ఇల్లు.. బిడ్డలకు ఆస్తిగా అందిస్తారా! అప్పుగా మిగుల్చుతారా అన్నది ఆ ఇంటి యజమాని దూరదృష్టిపై ఆధారపడి ఉంటుంది. ప్రొడక్ట్ లయబిలిటీ కవర్ ఇన్సూరెన్స్ (ఆస్తి బీమా) తీసుకున్నట్లయితే, ఊహించని ప్రమాదం ఎదురైనా ఆస్తి నిలబడుతుంది. లేకపోతే, అదే ఆస్తి గుదిబండగా పరిణమించే ప్రమాదం ఉంది. ఇల్లు తీసుకున్నప్పుడు దానిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యతనూ విస్మరించొద్దు.
సోమశేఖరం ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి. నెలసరి వేతనం రూ.80 వేలు. ఆఫీస్‌కు దగ్గర్లో రూ.50 లక్షలకు కొత్త ఫ్లాట్కొన్నాడు. కూడబెట్టుకున్న రూ.10 లక్షలు అడ్వాన్స్‌కు, రిజిస్ట్రేషన్‌కు వెచ్చించాడు. రూ.43 లక్షలు బ్యాంకు రుణం తీసుకున్నాడు. లోన్ అగ్రిమెంట్ మీద సంతకం పెడుతుంటే.. బ్యాంకు మేనేజర్ ‘ప్రొడక్ట్ లయబిలిటీ కవర్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మంచిది’ అన్నాడు. ‘అదేంటి? ఇంటికి ఇన్సూరెన్సా?’ అన్నాడు సోమశేఖరం. ‘అలాంటిదే! కానీ, బ్యాంకు రుణంపై ఇన్సూరెన్స్. భవిష్యత్తులో మీకు ఏదైనా ఊహించని ప్రమాదం జరిగితే రుణభారం మీ ఇంట్లోవాళ్ల మీద పడదు. బీమా సంస్థ పూర్తిగా చెల్లిస్తుంది’ అని వివరించాడు. ‘శుభమా అంటూ ఇల్లు కొంటుంటే చావు కబుర్లేంటి?’ అని బీమా తీసుకోవడానికి నిరాకరించాడు. రుణం మంజూరైంది. ఇల్లు సొంతమైంది. కానీ, రుణం పూర్తయ్యే వరకూ అది పూర్తిగా సొంతిల్లు కానట్టే! ఐదేండ్ల తర్వాత ఓ ప్రమాదంలో సోమశేఖరం కన్నుమూశాడు. ఆయన ఉద్యోగం చేసిన కంపెనీ నుంచి వచ్చిన కొద్ది మొత్తంతో అతని కుటుంబం రోజులు వెళ్లదీస్తున్నది. నెల రోజులు గడిచాక బ్యాంకు వాళ్లు వాయిదా కట్టమన్నారు. ఆ కుటుంబం చెల్లించే పరిస్థితిలో లేదు. మూడు నెలలు గడిచాయి. ఇల్లు వేలానికి వెళ్లింది. సోమశేఖరం కుటుంబానికి నిలువ నీడలేకుండా అయింది. గృహరుణం మంజూరైన నాడే.. లయబిలిటీ ఇన్సూరెన్స్ కూడా తీసుకొని ఉంటే పరిస్థితి మరోలా ఉండేది! కోటి రూపాయల టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకొని ఉన్నా.. ఇల్లు కోల్పోవాల్సి వచ్చేది కాదు!!
స్థూలంగా లయబిటిలీ ఇన్సూరెన్స్ ప్రయోజనం ఎలా ఉంటుందో సోమశేఖరం కథ చదివితే తెలుస్తుంది. ఎన్నేండ్లకు రుణం తీసుకుంటామో.. అన్ని సంవత్సరాలకు సరిపడా బీమా తీసుకోవడం శ్రేయస్కరం. రుణగ్రహీత కన్నుమూసే నాటికి ఉన్న లోన్ ఔట్‌స్టాండింగ్ మొత్తం బీమా సంస్థ చెల్లిస్తుంది. ఇంటి రుణం, కాలపరిమితిని బట్టి ఏకకాల ప్రీమియం రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు చెల్లించాల్సి వస్తుంది. గృహరుణం ఎన్ని సంవత్సరాల కాలపరిమితితో తీసుకుంటారో, బీమా కూడా అన్నేండ్లకూ వర్తించేలా తీసుకోవడం మంచిది. ఇంటి రుణం త్వరగా తీర్చేస్తే బీమా ప్రీమియం అడ్డికి పావుసేరు అంటే లక్షకు ఓ ఐదువేలు వెనక్కి వచ్చే అవకాశం ఉంది.
గృహరుణం తీసుకున్న వారంతా లయబిలిటీ ఇన్సూరెన్స్ తప్పకుండా ఎంచుకోవాల్సిందేనా? అని అడిగితే, అవసరం లేదనే చెప్పొచ్చు. జీవిత బీమా పెద్దమొత్తంలో ఉంటే, లయబిలిటీ ఇన్సూరెన్స్ తీసుకోకున్నా ఇబ్బంది రాదు. ఇదే సోమశేఖరం రూ.1.50 కోట్లకు జీవిత బీమా తీసుకొని ఉండి ఉంటే, ఆ మొత్తంలోంచి గృహరుణం పోగా రూ.1.15 కోట్లు కుటుంబానికి వచ్చేవి. రూ.2 కోట్లు అంతకుపైగా జీవితబీమా ఉన్న వ్యక్తులు లయబిలిటీ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం లేదు. వీటన్నిటికన్నా ముఖ్యంగా మీ పిల్లల వయసు, కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ పాలసీని తీసుకోవాలి. ఇంటి రుణం తీసుకునేటప్పుడే బీమా కూడా తీసుకోవాలి. మధ్యలో కావాలంటే అన్ని సంస్థలూ ఇవ్వవు. ఇప్పటికే గృహరుణం తీసుకొని, లయబిలిటీ పాలసీ తీసుకోకపోయి ఉన్నట్లయితే, పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ తీసుకోవడం ఒక మార్గం. యాక్సిడెంట్లో మరణిస్తేనే బీమా మొత్తం కుటుంబానికి అందుతుంది. ఈ బీమా ప్రీమియానికి అదనంగా రూ.800 నుంచి రూ.1,000 వరకు చెల్లిస్తే ఇంటి రుణానికి సైతం రక్షణ కల్పిస్తున్నాయి కొన్ని సంస్థలు. ఈ పాలసీ తీసుకుంటే ప్రమాదవశాత్తు జరగరానిది జరిగితే.. ఇంటి భారం ఇంట్లోవాళ్ల మీద పడదు.
☛ లయబిలిటీ ఇన్సూరెన్స్ ప్రీమియం అధికంగా ఉందని, తగ్గించమని అడుగుతుంటారు చాలామంది. ప్రీమియం తగ్గించే కొద్దీ బీమా కాలపరిమితి తగ్గుతుందని తెలుసుకోవాలి. దానివల్ల ఆశించిన ప్రయోజనం దక్కకపోవచ్చు.
☛ టర్మ్ ఇన్సూరెన్స్ భారీగా తీసుకోవాలంటే అందుకు తగ్గ ఆదాయం చూపించాల్సి ఉంటుంది. లయబిలిటీ ఇన్సూరెన్స్‌లో రుణం మొత్తానికి వర్తించే పాలసీ లభిస్తుంది.
☛ టర్మ్ ఇన్సూరెన్స్ రూ.2 కోట్లకు మించి ఉండి, ఇంటి రుణం రూ.కోటిలోపు ఉంటే లయబిలిటీ ఇన్సూరెన్స్ కచ్చితంగా తీసుకోవాల్సిన
పనిలేదు.
☛ పిల్లలు పూర్తిగా సెటిల్ అయినా, జీవిత భాగస్వామి కూడా సంపాదిస్తున్నా, జీవిత బీమా కలిగి ఉన్నా.. గృహరుణంపై బీమా ధీమా
అవసరం లేదు.
– ఎం. రాం ప్రసాద్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్
ram@rpwealth.in, www.rpwealth.in
“Home Loan on Whatsapp | హోంలోన్ కావాలా.. వాట్సాప్‌లోనే అప్లయ్ చేసుకొండిలా..!”
personal finance | నెలకు రూ.15వేలు ఇన్వెస్ట్ చేస్తే కోటి రూపాయలు సంపాదించవచ్చు
CIBIL Score | సిబిల్ స్కోర్ ఒక్కటి ఉంటే లోన్ వచ్చేస్తుందని అనుకుంటే పొరపాటే..