శుక్రవారం 05 మార్చి 2021
Business - Feb 20, 2021 , 00:43:42

పక్కాగా డిజిటల్‌ పేమెంట్స్‌

పక్కాగా డిజిటల్‌ పేమెంట్స్‌

సెక్యూరిటీ నిబంధనలు కఠినతరం 

కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన ఆర్బీఐ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: డిజిటల్‌ పేమెంట్‌ సెక్యూరిటీ నిబంధనలను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కఠినతరం చేసింది. బ్యాంకులు, ఇతర నియంత్రిత సంస్థల కోసం డిజిటల్‌ పేమెంట్ల భద్రత, నియంత్రణ, అమలును మరింత మెరుగుపర్చడానికి చర్యలు చేపట్టింది. పాత పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో డిజిటల్‌ చెల్లింపులకు ఆదరణ పెరిగిన విషయం తెలిసిందే. చలామణిలో కరెన్సీ కావాల్సినంత ఉన్నా.. చాలామంది ఆన్‌లైన్‌ పేమెంట్స్‌కే మొగ్గుచూపుతున్నారు. ప్రభు త్వం, బ్యాంకులు సైతం డిజిటల్‌ పేమెంట్స్‌నే ప్రోత్సహిస్తూ వస్తున్నాయి. అయితే మోసా లు, సైబర్‌ నేరాలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తున్నది. ఆన్‌లైన్‌ పేమెంట్లతో అమాయకులు నష్టపోతూనే ఉన్నారు. దీంతోనే డిజిటల్‌ పేమెంట్‌ సెక్యూరిటీ నిబంధనలను తాజాగా ఆర్బీఐ మరింత కట్టుదిట్టం చేసింది. డిజిటల్‌ వేదికల ద్వారా చెల్లింపులు, నగదు బదిలీలుసహా ఏటీఎం, మైక్రో ఏటీఎం, బిజినెస్‌ కరస్పాండెంట్ల నుంచి నగదు ఉపసంహరణల కోసం బహుళ పద్ధతుల్లో ధ్రువీకరించుకోవాలన్నది. దొంగిలించిన సమాచారంతో ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, డెబిట్‌ కార్డుల మోసాలకు తావుండరాదన్నది. మోసగాళ్లకు సంబంధించి కస్టమర్లను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉండాలన్నది.

పేమెంట్‌ యాప్స్‌పై ప్రభావం

కొత్త నిబంధనలు బ్యాంకులతోపాటు గూగుల్‌ పే, వాట్సాప్‌ పే, ఫోన్‌పే వంటి థర్డ్‌-పార్టీ పేమెంట్‌ యాప్‌లను ప్రభావితం చేయనున్నాయి. కస్టమర్ల డాటా నిల్వ, తమ బ్యాంకింగ్‌ భాగస్వాములతో ఎలా అనుసంధానం కావాలన్నదానిపై మొబైల్‌ పేమెంట్‌ యాప్‌లకు ఇబ్బందులు రావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బ్యాంకర్లకు ఆలస్యపు చెల్లింపుల సెటిల్మెంట్‌ తదితర అంశాల్లోనూ సమస్యలు వస్తాయంటున్నారు. కస్టమర్లకు ఈ చెల్లింపులు 24 గంటలకు మించి ఆలస్యం కావద్దని ఆర్బీఐ తాజా మార్గదర్శకాల్లో పేర్కొన్నది. యూపీఐ యాప్‌ల సోర్స్‌ కోడ్‌ ప్రొటెక్షన్‌ తప్పనిసరి చేసింది. కొత్త పాలసీ అమలు బాధ్యత బోర్డు, సీనియర్‌ మేనేజ్‌మెంట్‌దేనని ఆర్బీఐ తేల్చిచెప్పింది.

6 నెలల సమయం

ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌-కార్డ్‌ పేమెంట్స్‌, కస్టమర్ల రక్షణ, వినియోగదారుల సమస్యల పరిష్కార వ్యవస్థల కోసం ఆర్బీఐ నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకులు, స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు, పేమెంట్‌ బ్యాంకులు, కార్డులను జారీచేసే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, వాటికి కార్డులను సమకూరుస్తున్న సంస్థలు అనుసరించాల్సిన నియమావళిని తమ వెబ్‌సైట్‌లో పేర్కొన్నది. ఈ 21 పేజీల మాస్టర్‌ డైరెక్షన్‌ సర్క్యులర్‌ ప్రకారం నిర్దేశిత సెక్యూరిటీ ప్రోటోకాల్స్‌ను అన్ని మొబైల్‌ యాప్‌లు, ప్రభుత్వ-ప్రైవేట్‌ బ్యాంకర్లు, ఇతర ఆర్థిక సేవల సంస్థలు పాటించాల్సిందే. ఇందుకుగాను అన్ని నియంత్రిత సంస్థలకు 6 నెలల సమయాన్ని ఆర్బీఐ ఇచ్చింది.


VIDEOS

logo