 
                                                            Financial Changes | నవంబర్‌లో ఆర్థికపరంగా కొన్ని ముఖ్యమైన మార్పులు (Financial Changes) అమల్లోకి రానున్నాయి. ఆధార్ అప్డేట్ ఛార్జీల నుంచి బ్యాంక్ నామినేషన్ల వరకూ కీలక మార్పులు చోటు చేసకోబోతున్నాయి. కేంద్రం తీసుకొచ్చిన బ్యాంకింగ్ సవరణ చట్టం కారణంగా బ్యాంక్ ఖాతా నామినీలకు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
ఆధార్ (Aadhaar) కార్డుల్లో వివరాలను అప్డేట్ చేసుకునే ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ప్రకటించిన కొత్త నిబంధనలు రేపటి నుంచి (నవంబర్ 1) అమల్లోకి రానున్నాయి. పేరు, చిరునామా, పుట్టిన తేదీ, మొబైల్ నంబరు వంటి వ్యక్తిగత వివరాలను ఇంటినుంచే ఆన్లైన్లో సులభంగా అప్డేట్ చేసుకోవచ్చు. ఫింగర్ ప్రింట్లు, ఫొటో వంటి అప్డేట్ల కోసం మాత్రం ఆధార్ సేవా కేంద్రాలను తప్పనిసరిగా సందర్శించాల్సి ఉంటుంది.
కొత్త నిబంధనల ప్రకారం ఆధార్ కార్డు అప్డేట్ ఛార్జీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. పేరు, చిరునామా, మొబైల్ నంబర్ అప్డేట్ చేయడానికి రూ.75, బయోమెట్రిక్ వివరాలు, ఫొటో అప్డేట్ చేయడానికి రూ.125 చెల్లించాల్సి ఉంటుంది. ఇక 5-7 సంవత్సరాలు, 15 నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలకు బయోమెట్రిక్ అప్డేట్ ఏడాది పాటూ పూర్తిగా ఉచితంగా ఉంటుంది.
బ్యాంకు ఖాతాలు, లాకర్లు ఉన్న వారికి ఇప్పటిదాకా ఒక్కరినే నామినీగా పేర్కొనే అవకాశం ఉండేది. అయితే నవంబర్ 1 నుంచి కీలక మార్పులు చోటు చేసకోబోతున్నాయి. బ్యాంక్ ఖాతాదారులు తమ ఖాతాల్లో నలుగురిదాకా నామినీలను ఎంచుకోవచ్చు. ఈ కొత్త మార్పుల కారణంగా అత్యవసర సమయాల్లో కుటుంబ సభ్యులు నిధులను సులభంగా యాక్సెస్ చేసుకోడానికి వీలుంటుంది.
బ్యాంక్ ఖాతాల కోసం లబ్ధిదారుల పేరును చేర్చే ఈ విధానంలో రెండు పద్ధతుల (సైమల్టేనియస్, సక్సెసివ్ నామినేషన్స్)ను అనుసరించవచ్చు. దీంతో ఖాతాదారుల మరణానంతరం నామినీలకు ప్రయోజనాలను తదనుగుణంగా బ్యాంకులు అందిస్తాయి. ఇదిలావుంటే బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రభావవంతమైన క్లెయిమ్‌ల సెటిల్మెంట్కు ఇది దోహదం చేయగలదని అంటున్నారు. డిపాజిటర్లు తమ తదనంతరం ఒక్కో నామినీకి ఎంతెంత? రావాలన్నది కూడా నిర్ణయించవచ్చునని చెప్తున్నారు.
ఎన్పీఎస్ (NPS) కింద పెన్షన్ పొందుతున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్(యూపీఎస్)కి మారాలని భావించే వారికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గడువు నవంబర్ 30తో ముగియనుంది. ముందుగా ప్రకటించిన ప్రకారం సెప్టెంబర్ 30న గడువు ముగియనుండగా దీన్ని మరో రెండు నెలలపాటు పొడిగిస్తూ ఆర్థిక శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్‌కు సమాచారం అందచేసింది. ఉద్యోగుల నుంచి స్పందన అంతంతమాత్రంగా ఉన్న కారణంగా యూపీఎస్కి మారడానికి ఆర్థిక శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
ఏటా పెన్షన్‌ను తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు పెన్షన్ డిస్బర్సింగ్ ఏజెన్సీ (పీడీఏ)కి తమ జీవన్ ప్రమాణ్ లేదా వార్షిక జీవన ధ్రువపత్రం సమర్పించాల్సి ఉంటుంది. పెన్షనర్ జీవించే ఉన్నాడన్నదానికి ఈ లైఫ్ సర్టిఫికెట్ ప్రూఫ్ తప్పనిసరి. పెన్షన్ పొందేందుకు పెన్షనర్లు నవంబర్ 1 నుంచి 30లోపు లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఈ గడువు దాటితే పెన్షన్ చెల్లింపులు ఆలస్యం కావొచ్చు లేదా నిలిపివేయొచ్చు. ఇక 80 ఏళ్లు దాటిన వ్యక్తులకు అక్టోబర్ 1 నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమైంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) లాకర్ అద్దె ఛార్జీలను సవరించనుంది. కొత్త రేట్లు లాకర్ సైజు, కేటగిరీపై ఆధారపడి ఉంటాయి. కొత్త ఛార్జీలు నవంబర్‌లో ప్రకటించనుంది. నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచి 30 రోజుల తర్వాత ఈ కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన క్రెడిట్ కార్డు (SBI Card) వినియోగదారులకు బిగ్ అలర్ట్.. కార్డ్ ఛార్జీలను ఎస్బీఐ సవరించింది. వివిధ రకాల సేవలపై ఫీజు పెంచింది. మొబిక్విక్, క్రెడ్ వంటి థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగించి చేసే ఎడ్యుకేషన్ ఫీజు చెల్లింపులపై ఇకపై 1 శాతం ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీ వెబ్సైట్లు, పీఓఎస్ మెషీన్ల వద్ద చేసే చెల్లింపులకు ఈ ఫీజు వర్తించదు. ఎస్బీఐ కార్డును ఉపయోగించి డిజిటల్ వాలెట్లో రూ.వెయ్యికి మించి చేసే లావాదేవీలకు 1 శాతం ఫీజు వర్తిస్తుంది. ఈ కొత్త ఛార్జీలు నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
Also Read..
Gold | వన్నె తగ్గిన బంగారం.. జూలై-సెప్టెంబర్‌లో 16 శాతం పడిపోయిన డిమాండ్
కెనరా బ్యాంక్ లాభం 4,774 కోట్లు
 
                            