 
                                                            న్యూఢిల్లీ, అక్టోబర్ 30 : కెనరా బ్యాంక్ అంచనాలకుమించి రాణించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.4,774 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.4,015 కోట్ల లాభంతో పోలిస్తే 19 శాతం ఎగబాకింది. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడం వల్లనే లాభాల్లో రెండంకెల వృద్ధి నమోదైందని బ్యాంక్ ఎండీ, సీఈవో కే సత్యనారాయణ రాజు తెలిపారు.
బ్యాంక్ ఆదాయం రూ.34,721 కోట్ల నుంచి రూ.38,598 కోట్లకు చేరుకున్నట్టు చెప్పారు. దీంట్లో వడ్డీల మీద రూ.31,544 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 2.35 శాతానికి తగ్గ గా, నికర ఎన్పీఏ 0.54 శాతానికి దిగొచ్చింది. మొండి బకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్ రూ.1,504 కోట్ల నిధులను కేటాయించినట్లు చెప్పారు. బ్యాంకు వద్ద పుష్కలంగా నిధులు ఉన్నాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిధులను సేకరించాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
 
                            