 
                                                            న్యూఢిల్లీ, అక్టోబర్ 30 : బంగారానికి డిమాండ్ పడిపోయింది. ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన ధరల కారణంగా కొనుగోళ్లు నిలిచిపోయాయి. దీంతో జూలై-సెప్టెంబర్ మధ్యకాలంలో పుత్తడికి డిమాండ్ 16 శాతం పడిపోయిందని ప్రపంచ స్వర్ణ మండలి తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. గత త్రైమాసికంలో కేవలం 209.4 టన్నుల పుత్తడికి మాత్రమే డిమాండ్ నెలకొన్నదని తెలిపింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో 248.3 టన్నులకు డిమాండ్ ఉంది. అయినప్పటికీ విలువ పరంగా చూస్తే మాత్రం భారీగా పెరిగింది. కిందటేడాది ఇదే త్రైమాసికంలో రూ.1,65,380 కోట్లుగా ఉన్న పుత్తడి ఈసారి త్రైమాసికానికిగాను 23 శాతం ఎగబాకి రూ.2,03,240 కోట్లకు చేరుకున్నది. రికార్డు స్థాయికి చేరుకున్న ధరల కారణంగా డిమాండ్ పడిపోయినప్పటికీ, పెట్టుబడులకు మాత్రం ఇదే సురక్షితమైనదిగా మారిపోయిందని పేర్కొంది. ప్రపంచంలో పసిడి వినిమయంలో రెండో అతిపెద్ద దేశమైన భారత్‌లో బంగారం ఆభరణాల డిమాండ్ కూడా 31 శాతం తగ్గి 117.7 టన్నులకు జారుకున్నది.
ప్రస్తుత సంవత్సరంలో భారత్‌లో పసిడి డిమాండ్ 600-700 టన్నుల స్థాయిలో ఉంటుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజాగా తన అంచనాను వెల్లడించింది. గడిచిన తొమ్మిది నెలల్లో భారత్‌లో 462.4 టన్నుల పసిడి విక్రయాలు జరిగాయి. మరోవైపు, మూడో త్రైమాసికంలో అంతర్జాతీయంగా 1,313 టన్నుల బంగారం అమ్మకాలు జరిగాయని తెలిపింది. రికార్డు స్థాయికి చేరుకున్న ధరల కారణంగా పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు ఎగబడి కొనుగోళ్లు చేయడం, పెట్టుబడుల డిమాండ్ అధికంగా ఉండటం ఇందుకు కారణమని తన నివేదికలో వెల్లడించింది.
బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. ఇప్పట్లో వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు లేవని ఫెడ్ ప్రకటించడం, అమెరికా-చైనా దేశాల మధ్య వాణిజ్య చర్చలు కొలిక్కివస్తుండటంతో మదుపరులు తమ పెట్టుబడులను సురక్షితమైన బంగారం నుంచి ఈక్విటీలకు తరలించడంతో వీటి ధరలు తగ్గుముఖం పట్టాయి. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో పదిగ్రాముల బంగారం ధర రూ.1,000 తగ్గి రూ.1,23,400కి దిగొచ్చింది. కానీ, వెండి ధరలు భారీగా పెరిగాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో కిలో వెండి రూ.3,300 ఎగబాకి రూ.1.55 లక్షలకు చేరుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 53.26 డాలర్లు ఎగబాకి 3,9983.87 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.
దీర్ఘకాలిక విలువ నిల్వగా బంగారం పట్ల దేశీయ వినియోగదారులు వ్యూహాత్మక నిబద్దతను కలిగివున్నారు. పరిమాణం తగ్గినప్పటికీ కీలకమైన పండుగలు, వివాహాల సీజన్‌తో డిమాండ్ ఆశాజనకంగా ఉండనున్నది. రిటైలర్ల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడం, దీపావళి పండుగ సీజన్లో బలమైన అమ్మకాలు కనిపించాయి. పరిమాణం పరంగా తగ్గినప్పటికీ విలువ పరంగా చూస్తే భారీగా పెరిగింది.
 
                            