e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, August 6, 2021
Home ఖమ్మం పల్లెలకు ‘ప్రగతి’ కళ

పల్లెలకు ‘ప్రగతి’ కళ

పల్లెలకు ‘ప్రగతి’ కళ

పల్లె ప్రగతితో మారిన గ్రామాల రూపురేఖలు
మొక్కల పెంపకంతో ‘హరిత’శోభ
విద్యుత్‌ సమస్యలకు పరిష్కారం
పారిశుధ్య నిర్వహణతో సీజనల్‌ వ్యాధులకు చెక్‌

మామిళ్లగూడెం, జూలై 14: పల్లెలకు ‘ప్రగతి’ కళ వచ్చింది.. ‘పల్లె ప్రగతి’ కార్యక్రమంతో గ్రామాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. గతంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గ్రామాలను అభివృద్ధి బాట పట్టించింది. సమస్యలతో సతమతమైన గ్రామాలకు పరిష్కారం చూపించింది. శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, బురదమయంగా మారిన రోడ్లు, చెత్తాచెదారంతో అస్తవ్యస్తంగా తయారైన పల్లెలు.. ప్రస్తుతం స్వచ్ఛత దిశగా అడుగులు వేస్తున్నాయి. ఎక్కడ చూసినా మొక్కలతో పచ్చదనం కనువిందు చేస్తున్నది. పల్లె ప్రకృతి వనాలు ఆహ్లాదాన్ని పంచుతుండగా.. వైకుంఠధామాల నిర్మాణంతో ఆఖరి మజిలీ కష్టాలు తీరాయి. ప్రతి పంచాయతీకి ట్రాక్టర్‌ అందుబాటులోకి రావడంతో ట్యాంకర్‌ ద్వారా మొక్కలకు నీరందిస్తున్నారు. ట్రాలీల ద్వారా ఎప్పటికప్పుడు చెత్త, డంపింగ్‌ యార్డులకు తరలించి వర్మీకంపోస్టు ఎరువులను తయారు చేస్తున్నారు. ‘పల్లె ప్రగతి’ ముగిసిన నేపథ్యంలో జిల్లాలో చేపట్టిన పనులపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.

పల్లె ప్రగతి గ్రామాల రూపురేఖలు మార్చింది. ఈ నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు పల్లె పల్లెనా ప్రగతి పనులు జరిగాయి. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా పనిచేసి గ్రామాలను అభివృద్ధి బాట పట్టించారు. దీనిలో భాగంగా ఖమ్మం జిల్లాలో చేపట్టిన ‘పల్లె ప్రగతి’ విజయవంతమైంది. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆదేశాల మేరకు అధికారులు ప్రగతి పనులను పర్యవేక్షించారు. ప్రభుత్వ లక్ష్యాలు చేరుకునేలా చర్యలు తీసుకున్నారు. పాలకవర్గాలు ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకుని గ్రామస్తులకు మౌలిక వసతులు కల్పించాయి. సమస్యలను గుర్తించిన వెంటనే వాటికి పరిష్కారం చూపాయి. కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, రాష్ట్ర పంచాయతీరాజ్‌ ,గ్రామీణాభివృద్ధిశాఖ ప్రధాన కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, కమిషనర్‌ రఘునందన్‌రావు స్వయంగా గ్రామాల్లో పర్యటించి ప్రగతి పనులను ప్రారంభించారు. అధికారులు, ప్రజాప్రతినిధుల కృషిని అభినందించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, పువ్వాడ అజయ్‌కుమార్‌తో పాటు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు గ్రామాల్లో పర్యటించి దిశానిర్దేశం చేశారు.

- Advertisement -

ఆహ్లాదకరంగా పల్లెలు..
జిల్లాలోని ప్రతి పంచాయతీలో పల్లె ప్రకృతి వనాలు, వన నర్సరీలు ఏర్పాటయ్యాయి. అవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా నాటిన మొక్కలు గ్రామానికి కొత్తశోభను తీసుకువచ్చాయి. వైకుంఠ ధామాల ఏర్పాటుతో గ్రామస్తులకు ఆఖరి మజిలీ కష్టాలు తీరాయి. డంపింగ్‌ యార్డులు, కంపోస్టు షెడ్ల నిర్మాణంతో పారిశుధ్య నిర్వహణ గాడిలో పడింది. దీనికి ట్రాక్టర్‌, ట్రాలీలు చక్కగా ఉపయోగపడుతున్నాయి. సీజనల్‌వ్యాధులు ప్రబలకుండా ఫాగింగ్‌ చేయడంతో దోమల నివారణ సాధ్యమైంది. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేసేందుకు విద్యుత్‌శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. అవసరమైన చోట కొత్త విద్యుత్‌ స్తంభాలు, మీటర్లు ఏర్పాటు చేశారు.

ప్రగతి ఇలా సాధ్యమైంది..
జిల్లాలోని 589 పంచాయతీల పరిధిలో పది రోజుల పాటు జరిగిన పారిశుధ్య పనుల్లో సిబ్బంది 29,368 కిలోమీటర్ల మేర రహదారులను శుభ్రం చేశారు. 10,533 కిలోమీటర్ల మురుగు కాలువల్లో పూడిక తీశారు. 5,166 శిథిల ప్రభుత్వ భవనాలను కూల్చివేశారు. నివాసానికి అనువుగా లేని 1,332 భవనాలను తొలగింపజేశారు. జిల్లావ్యాప్తంగా 379 వైకుంఠ ధామాలు పూర్తయి వినియోగంలోకి వచ్చాయి. 303 గ్రామాల్లో డంపింగ్‌ యార్డులకు బయో ఫెన్సింగ్‌ ఏర్పాటైంది. జిల్లాలోని 2,51,928 గృహాలకు ఇంటింటికీ ఆరు మొక్కల చొప్పున 16,82,212 మొక్కలు పంపిణీ జరిగింది. అవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా 1,23,009 మొక్కలు పెరుగుతున్నాయి. విరిగిన, తుప్పు పట్టిన స్తంభాల స్థానంలో కొత్తగా 828 విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటయ్యాయి. 354 నూతన విద్యుత్తు మీటర్లు ఏర్పాటు చేశారు.

పల్లె ప్రగతి నిరంతర ప్రక్రియ..
జిల్లాలోని అని పంచాయతీలకు కలిపి నెలకు రూ.13 కోట్ల నిధులు ప్రభుత్వం నుంచి విడుదలవుతున్నాయి. ఈ నిధులతో పాలకవర్గాలు గ్రామస్తులకు మౌలిక వసతులు కల్పిస్తున్నది. గ్రామాల్లో వైకుంఠ ధామాలు, డంపింగ్‌ యార్డులు, కంపోస్ట్‌ షెడ్స్‌ నిర్మాణాలు పూర్తయ్యాయి. పల్లె ప్రకృతి వనాలు, వన నర్సరీల్లో నిరంతరం మొక్కల పెంపకం చేపడతాం. పారిశుధ్య పనులను పక్కాగా చేపడుతున్నాం. ఈ విషయంలో రాజీ లేదు.
వాసిరెడ్డి ప్రభాకర్‌రావు, జిల్లా పంచాయతీ అధికారి, ఖమ్మం

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పల్లెలకు ‘ప్రగతి’ కళ
పల్లెలకు ‘ప్రగతి’ కళ
పల్లెలకు ‘ప్రగతి’ కళ

ట్రెండింగ్‌

Advertisement