KCR | ముప్పై ఏళ్లు ప్రజలను మూసీ నీళ్లు తాగించిందని ఇదే కాంగ్రెస్ రాజ్యమని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మండిపడ్డారు. బస్‌యాత్రలో భాగంగా సూర్యాపేటలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణను పూలపొదరిల్లులా ఒకటీ ఒకటీ మొట్టుగట్టుకుంటూ తెలంగాణను మంచిగా తయారు చేసుకున్నాం. రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరి ఊహలకు అందకుండా ఎలా అభివృద్ధి చేసుకున్నామో మీకు తెలుసు. అందులో మీరందూ భాగస్వాములే. సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ నియోజకవర్గాల్లోని కొన్ని ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు ఎండి ఏవిధంగా ఎడారిగా ఉండెనో మీకు తెలుసు. బ్రహ్మాండంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్న తర్వాత అద్భుతమైన నీటి సదుపాయం తెచ్చుకున్నాం’ అన్నారు.
‘సూర్యాపేట, తుంగతుర్తి ప్రాంతాల్లో సుమారు 2.50లక్షల ఎకరాలకు నీరువచ్చింది. ఒకనిమిషం కరెంటు పోకుండా అద్భుతంగా చేసుకున్నాం. అన్నిగ్రామాలు, పట్టణాలను పల్లెపగ్రతి, పట్టణాలను పచ్చటిచెట్లతో ఎంత బాగా చేసుకున్నామో మీకు తెలుసు. జగదీశ్వర్‌రెడ్డి నాయకత్వంలో సూర్యాపేట పట్టణం ఎంత బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినామో మీకు తెలుసు. సూర్యాపేటను జిల్లా చేసుకున్నాం. మెడికల్ కాలేజీ తెచ్చుకున్నం. సద్దుల చెరువును ముద్దుల చెరువు చేసుకోగలిగాం. పోయినసారి వచ్చినప్పుడు నేను చూసి ఆశ్చర్యపోయాను. ఇలాంటి మంచి కార్యక్రమాలు అనేకం చేసుకున్నాం. పేదలకు పెన్షన్లు ఇచ్చుకున్నాం. రూ.200 పెన్షన్‌ను రూ.2వేల పెన్షన్ చేసి పేదసాదలను కాపాడుకున్నాం. లంబాడీ తండాలను గ్రామపంచాయతీలుగా చేశాం. దళితబిడ్డలు ధనికబిడ్డలు కావాలని.. కుటుంబానికి రూ.10లక్షలు ఇచ్చి దళితబంధు తెచ్చుకున్నాం. ఇవన్నీ మీ కండ్ల ముందే జరిగిన కార్యక్రమాలే. బ్రహ్మాండంగా తెలంగాణ ముందుకు దూసుకొని పోతువుండే’ అంటూ గుర్తు చేశారు.
‘ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు ఇచ్చింది. వాళ్ల నోటికి మొక్కాలి. ఎదురైన మాటచెప్పి మనల్ని మోసం చేస్తే.. 1.8శాతం ప్రభుత్వాన్ని కోల్పోయాం. సరే ప్రజల ఆశీర్వాదం. ప్రజలు ఏపాత్ర ఇస్తే ఆ పాత్రలో పని చేస్తాం. కానీ, ఈ నాడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్కటీ అమలు చేయలేదు. చేసిన బస్సు హామీ కూడా కిరికిరిగా ఉన్నది తప్పటే.. అనుకున్న పద్ధతిగా లేదు. మనం రెండుసార్లు రెండు విడుతలుగా రైతులకు రూ.30వేలకోట్ల రుణమాఫీ చేసుకున్నాం. అదేవిధంగా రైతుబంధు వస్తుండే. ఈ సారి రైతుబంధు అందరికీ వచ్చిందా? అందరికీ రాలేదు కదా? ఎవరికి వచ్చిందో దేవుడికే ఎరుక. అది ఉంటడో.. ఊడగొడుతరో తెలియదు. రైతుబీమా ఉంచుతరో.. ముంచుతరో తెలియదు. కరెంటు మాయమైపోయింది. మిషన్ భగరీథలో ఇంటింటికి వచ్చిన నీళ్లు మాయమైపోయినయ్. జగదీశ్వర్‌రెడ్డి నాయకత్వంలో పెద్దదేవులపల్లి నుంచి, టెయిల్‌పాండ్, పాలేరు నుంచి శుద్ధమైన నీరు ఇచ్చుకున్నాం’ అన్నారు.
‘సూర్యాపేటది విచిత్రమైన పరిస్థితి. ముప్పై సంవత్సరాలు మూసీ మురికి నీళ్లు తాగించింది ఇదే కాంగ్రెస్. కాంగ్రెస్ రాజ్యంలో మురికి నీళ్లు తాగించారు. ఇది మీ అందరికీ తెలుసు. ఆ బాధలు పోగొట్టి అద్భుతంగా మిషన్ భగీరథ తెచ్చుకున్నాం. దాన్ని కూడా నాశనం చేస్తున్నారు. దాన్ని నడిపే పరిస్థితి లేదు. ఏ వర్గాన్ని ఆదుకునే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి 225 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పండించిన ధాన్యం కొనే తెలివి కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఈ రోజు చాలాచోట్ల కొనుగోలుకేంద్రాల దగ్గర ప్రజలు నన్ను ఆపారు. సార్ 20 రోజులైంది మేం వడ్లు తెచ్చి.. ఇప్పటి వరకు కాంటా పెడుతలేరు అని చెబుతున్నరు. ఏం చెప్పిండు ముఖ్యమంత్రి.. మీరు పరుగెత్తుండ్రి. కేసీఆర్ లక్ష మాఫీ చేసిండు కదా.. నేను రూ.2లక్షలు మాఫీ చేస్తా.. డిసెంబర్ 9న లోన్ మొత్తం కట్టేస్తా అని చెప్పిండు. మరి లోన్ మాఫీ అయ్యిందా? అయ్యే అవకాశం ఉందా? నామం పెట్టినట్టేనా? మరి మనం ఏం చేయాలి. దళితబంధు గతి ఏం చేస్తారో తెలియదు. రైతుబంధు ఐదెకరాలు, మూడెకరాలకే ఇస్తం.. వ్యవసాయం చేసినోడికే ఇస్తం.. ఎన్ని గలీజ్ మాటలు మాట్లాడుతున్నరు. రైతులంటే బిచ్చగాళ్లలా కనిపిస్తున్నారా? రైతులంటే మీకు లక్ష్యం లేదా? అంటూ కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రైతులు మంచిగ నడింట్లో పండుకొని ఆటో స్టార్టర్ పెట్టి బ్రహ్మాండగా పొలాలు పారిచ్చేది. కాలుమీద కాలువేసుకొని ఉండేది. సమయానికి పెట్టుబడి వచ్చి అప్పులు తీసుకునే అవసరం లేకుండా వ్యవసాయం చేసేది. మూడున్నరకోట్ల టన్నుల వడ్లు తెలంగాణ పండించింది. ఇవాళ అవన్నీ పోతున్నయ్. కేసీఆర్ పక్కకు జరుగంగనే.. కట్క బంద్ చేసినట్లుగా కరెంటు బంద్ అవుతుందా? నీళ్లు బంద్ అవుతాయా? మొన్న ఇక్కడ పంటలు ఎండిపోతే నేను చూసేందుకు వచ్చిన. కేసీఆర్ వస్తుండగనే కాలువలో నీళ్లు ఇడ్వాలే. కేసీఆర్ వెళ్లిపోంగనే నీళ్లు బంద్ చేయాలి. ఇంత నాటకమా? ఇంత ఘోరమా? కాళేశ్వరం ప్రాజెక్టులో ఒకటో రెండో పిల్లర్లు మునిగిపోతే.. అదేందో ప్రపంచం మునిగిపోయినట్లు దుష్ప్రచారం చేసి.. నీళ్లు మొత్తం రాకుండా చేశారు. 60-70 టీఎంసీల నీళ్లను సముద్రంలోకి వదిలేశారు. అవి ఎత్తిపోస్తే ఎకరం కూడా పంట ఎండేది కాదు. మరి ఏం జరగాలి. నేను ఒక్కటే మీ అందరినీ కోరుతున్నా’నన్నారు.