YS Sharmila | వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు (Ysrtp Chief) వైఎస్ షర్మిల (YS Sharmila) తన సోదరుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవనున్నారు. బుధవారం తల్లి విజయమ్మతో కలిసి తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసానికి షర్మిల వెళ్లనున్నారు. కుటుంబసభ్యులతో కలిసి మంగళవారం ఇడుపులపాయకు వచ్చిన వైఎస్ షర్మిల ఇవాళ మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో గన్నవరం వెళ్లనున్నారు. అక్కడ నుంచి తాడేపల్లిలోని సీఎం నివాసానికి చేరుకోనున్నారు. కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను సోదరుడికి అందజేయనున్నట్లు తెలుస్తోంది. అనంతరం సాయంత్రం విజయవాడ నుంచి షర్మిల ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నట్లు సమాచారం.
షర్మిల కుమారుడు రాజారెడ్డికి వివాహం నిశ్చయమైన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 17వ తేదీన అట్లూరి ప్రియతో కుమారుడి వివాహం నిశ్చయించినట్లు షర్మిల స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ నేపథ్యంలో జనవరి 18వ తేదీన వీరి నిశ్చితార్థ వేడుకను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగానే మంగళవారం కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో కలిసి ఇడుపులపాలోని వైఎస్సార్ ఘాట్‌ను షర్మిల సందర్శించారు. తొలి ఆహ్వాన పత్రికను అక్కడ ఉంచి తండ్రి ఆశీస్సులు తీసుకున్నారు.
ఇదిలా ఉండగా.. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరికకు ముహూర్తం ఖరారైన విషయం తెలిసిందే. ఈనెల 4న పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఆమెతోపాటు మరో 40 మంది కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. షర్మిలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించాలని కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు షర్మిల భర్త అనిల్‌కుమార్‌తో ఇప్పటికే ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు చర్చించినట్టు సమాచారం. ఫైనల్‌గా షర్మిలతో కూడా ఈ విషయం మరోసారి చర్చించాక ఏఐసీసీసీ అధికారికంగా ప్రకటిస్తుందని సమాచారం.
Also Read..
Coronavirus | 24 గంటల్లో 602 కొత్త కేసులు.. ఐదు మరణాలు
Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి
Japan Earthquake | శిథిలాల కింద మృతదేహాలు.. 62కు చేరిన జపాన్ భూకంప మరణాలు