గురువారం 28 జనవరి 2021
Andhrapradesh-news - Nov 26, 2020 , 21:34:54

తిరుమలలో ఎడతెరిపి లేని వర్షం..

తిరుమలలో ఎడతెరిపి లేని వర్షం..

తిరుమల : నివర్ తుఫాన్ ప్రభావం తిరుమలపై కూడా పడిందింది. బుధవారం నుంచి తిరుమలలో ఎడతెరిపి‌ లేకుండా కురుస్తున్న వర్షానికి భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కుండపోత వర్షానికి తిరుమలలోని రహదారులు, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. శ్రీవారి ఆలయ పరిసరాలు, మాఢ వీధుల్లో‌ భారీగా వరద నీరు చేరింది. టీటీడీ పారిశుధ్య సిబ్బంది వరద నీటిని మ్యాన్ హోల్స్ ద్వారా బయటకు పంపేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. భారీగా వర్షానికి తిరుమలలోని జలాశయాలన్నీ పొంగి పొర్లుతున్నాయి.


గోగర్భం, కేపీ డ్యాం పూర్తిగా నిండుకుండలా మారడంతో తెల్లవారుజామున టీటీడీ అధికారులు గేట్లను ఎత్తి  నీటిని దిగువకు  విడుదల చేశారు. తిరుమలలో స్థానికులు నివాసం ఉండే బాలాజీ నగర్‌లో ఈదురుగాలుల ధాటికి చెట్లు, పలువురు ఇండ్ల ప్రహరీలు కూలిపోయాయి. విద్యుత్ సరఫరా స్తంభించింది. అంధకారం నెలకొనడంతో స్థానికులు భయాందోళనకు లోనవుతున్నారు. భారీ వర్షానికి రెండవ ఘాట్ రోడ్డులో అక్కడక్కడా కొండచరియలు విరిగి పడుతున్నాయి. దీంతో వాహనాల రాకాపోకలకు అంతరాయం కలుగుతోంది.  రెండురోజులపాటు జిల్లాలో‌ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఘాట్ రోడ్డులో ప్రయాణించే యాత్రికులను, శ్రీవారి దర్శనార్ధం వచ్చిన భక్తులకు అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo