Vakiti Srinivasulu | కర్నూల్ : కర్నూల్ జిల్లాలో ఘోరం జరిగింది. టీడీపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. పత్తికొండ మండలం హోసూరులో ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
టీడీపీ నేత వాకిటి శ్రీనివాసులు(45) బుధవారం తెల్లవారుజామున తన ఇంటి నుంచి బహిర్భూమికి వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన దుండగులు.. శ్రీనివాసులు కళ్లల్లో కారం చల్లి దాడి చేశారు. అనంతరం అతన్ని హత్య చేసి పారిపోయారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఘటనాస్థలానికి భారీ సంఖ్యలో చేరుకున్నారు. శ్రీనివాసులు భార్యాపిల్లలు శోకసంద్రంలో మునిగిపోయారు.
సమాచారం అందుకున్న డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సీఐ జయన్న ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. టీడీపీ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. హత్య ఘటనకు దారితీసిన పరిస్థితులను డీఎస్పీతో మాట్లాడారు. నిందితులను గుర్తించి తక్షణమే అరెస్టు చేయాలని ఎమ్మెల్యే పోలీసులను ఆదేశించారు. ఎమ్మెల్యేకు శ్రీనివాసులు ప్రధాన అనుచరుడు. కేఈ శ్యాంబాబు గెలుపులో శ్రీనివాసులు కీలకంగా వ్యవహరించారు.
శ్రీనివాసులును హత్య చేసిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ ద్వారా కేసును కొలిక్కి తీసుకొస్తామని చెప్పారు. శ్రీనివాసులుకు గ్రామంలో ఎవరితోనూ ఎలాంటి గొడవలు లేవని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. హత్య జరిగిన ప్రాంతానికి కిలోమీటర్ దూరంలో బీర్ సీసాలు లభ్యమయ్యయాని చెప్పారు. తల వెనుక భాగంలో మారణాయుధాలతో బలంగా దాడి చేసి చంపారని డీఎస్పీ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Nara Lokesh | టీడీపీ శ్రేణుల సహనాన్ని చేతగానితనంగా భావించొద్దు : నారా లోకేశ్
Girl Molest | శంషాబాద్లో దారుణం.. వ్యవసాయ కూలీ పనులకు వెళ్లిన గిరిజన బాలికపై అత్యాచారం..