Peddapur Gurukul : జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఇటీవల వరుస పాముకాట్లు కలకలం రేపుతున్నాయి. ఈ పాముకాట్ల బారినపడి ఇప్పటికే పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు మరణించారు. పలువురు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఆ పాఠశాలలో ఓ మహిళకు ఇవాళ పూనకం వచ్చింది.
తాను నాగదేవతనని, ఈ పాఠశాలలో తనకు తావు దొరకక తిరుగుతున్నానని చెప్పింది. తనకు వెంటనే గుడి కట్టించాలని, లేకపోతే ఇలాంటి పాముకాటు ఘటనలు మళ్లీ పునరావృతమవుతాయని హెచ్చరించింది. కాగా, పెద్దాపూర్ గురుకుల స్కూల్లో విద్యార్థుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 10 రోజుల వ్యవధిలోనే ఇద్దరు విద్యార్థులు మృతిచెందగా పలువురు అస్వస్థతకు గురయ్యారు.
దాంతో ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గరవుతున్నారు. జూలై 27న పాముకాటుకు గురై ఓ విద్యార్థి మరణించాడు. ఆ ఘటనను మరువకముందే గత శుక్రవారం అనిరుధ్, మోక్షిత్ అనే ఇద్దరు విద్యార్థులను పాము కాటేసింది. దాంతో తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థులను కోరుట్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఆ తర్వాత వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం జగిత్యాల జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన అనిరుధ్ మృతిచెందాడు. మరో విద్యార్థి మోక్షిత్ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.