Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో టీడీపీ నేత, ఆ గ్రామ మాజీ సర్పంచి వాకిటి శ్రీనివాసులు హత్యకు గురయ్యారు. ఈ హత్యపై ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. వాకిటి శ్రీనివాసులును వైసీపీ మూకలు దారుణంగా హత్య చేశాయని నారా లోకేశ్ ఆరోపించారు. ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా ఒక పోస్టు చేశారు.
ఎన్నికల్లో టీడీపీ తరఫున కీలకంగా పనిచేశాడనే కక్షతో శ్రీనివాసులు కళ్లలో కారం కొట్టి కిరాతకంగా హతమార్చారని మండిపడ్డారు. ప్రజాక్షేత్రంలో తిరస్కరణకు గురైనా జగన్ అండ్ కో తమ పాత పంథాను మార్చుకోకుండా ఇటువంటి దురాగతాలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. టీడీనీ శ్రేణుల సహనాన్ని చేతగానితనంగా భావించవద్దని హెచ్చరించారు.
ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడే వారిపై ప్రజా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. వైకాపా మూకల చేతిలో బలైన శ్రీనివాసులు కుటుంబానికి టీడీపీ అండగా నిలుస్తుందని నారా లోకేశ్ హామీ ఇచ్చారు. శ్రీనివాసులు హత్యను టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఖండించారు. హత్య వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.