Srisailam | శ్రీశైలం : లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ శ్రీశైలం ఆలయంలో భ్రమరాంబ మల్లికార్జునవారల ఊయల సేవను ఘనంగా నిర్వహించారు. ప్రతి శుక్రవారం, పౌర్ణమి, మూలానక్షత్రం రోజున ఊయలసేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఉత్సవంలో తొలుత లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకులు సంకల్పాన్ని పఠించారు. కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ చేశారు. ఆ తర్వాత ఊయలలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార ఉత్సవమూర్తలను వేంచేపు చేసి.. శాస్త్రోక్తంగా షోడషోపచార పూజలు చేసి.. ఊయలసేవ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు విశేషంగా పుష్పాలంకరణ, పుష్పార్చనలు చేశారు.
అలాగే, మూలనక్షత్రం సందర్భంగా మంగళవారం రాత్రి స్వామి అమ్మవార్ల పల్లకీ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉత్సవాన్ని ప్రతి ఆదివారం, పౌర్ణమి, మూల నక్షత్రం రోజున సర్కారీ సేవగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. కార్యక్రమంలో భాగంగా తొలుత అమ్మవారి ఆలయ ఆశీర్వచన మండపంలో లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని పఠించారు. అనంతరం మహాగణపతిపూజ.. ఆ తర్వాత స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో వేంచేబు చేయించి శాస్త్రోక్తంగా షోడశోపచారపూజలు చేశారు.