Srisailam Temple | శ్రీశైలం : కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం తరఫున వినాయకుడికి అధికారులు మంగళవారం పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆగస్టు 27 నుంచి కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ క్రమంలో శ్రీశైలం ఆలయ ఈవో ఎం శ్రీనివాసరావు, అర్చకులు, వేదపండితులు, పలువురు అధికారులు ఆలయానికి చేరుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకుముందు కాణిపాకం దేవస్థాన ఈవో కే పెంచల కిశోర్, అర్చకులు, వేదపండితులు సాదరంగా మల్లన్న ఆలయ అధికారులను ఆహ్వానించారు. అనంతరం సంప్రదాయబద్ధంగా మేళతాళాలతో స్వయంభు వరసిద్ధి వినాయకస్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పించి, స్వామివారికి పూజలు చేశారు. ఆ తర్వాత ఈ దేవస్థానం అధికారులను, అర్చకులను కాణిపాక ఆలయ అధికారులు సత్కరించారు. ఆలయ సంస్కృతి సంప్రదాయాలను దృష్టిలో ఉంచుకొని ప్రతిసంవత్సరం వరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీశైల దేవస్థానం తరపున ఈ పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు వివరించారు.